ఇప్పుడు కుర్ర దర్శకులు తమ ఒకే ఒక్క షార్ట్ ఫిలిమ్‌తో కూడా రచ్చ రచ్చ చేసేస్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు దర్శకుల విషయంలో యువరక్తం నిండిపోయింది. కానీ ఓ ముగ్గురు సీనియర్ దర్శకులు మాత్రం ఈ వయసులో కూడా తమ పూర్వవైభవం కోసం తాపత్రయపడుతున్నారు. 'చిత్రం, నువ్వు నేను, జయం' వంటి చిత్రాలతో భారీ బడ్జెట్ చిత్రాలకు, స్టార్ హీరోలు, డైరెక్టర్లకు కూడా వణుకుపుట్టించిన దర్శకుల్లో తేజను ముందుగా చెప్పుకోవాలి. అయితే ఆయనకు 'జయం' తర్వాత మరలా అంతటి 'జయం' లభించలేదు. ఆ వరుసలో ఆయన తీసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. కానీ తేజ మాత్రం తనను తాను నమ్ముకొని 'బాహుబలి'తో కేక పుట్టించిన రానా వంటి యువ నటుడిని హీరోగా తీసుకొని, ఆయనకు జోడీగా తానే ఇండస్ట్రీకి పరిచయం చేసిన టాప్‌హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకొని కొత్త సంచలనం సృష్టిస్తానంటున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నై శివార్లలో జరుగుతోంది. ఇక 'ఇంద్ర, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ అప్పుడెప్పుడో మొదలుపెట్టిన గోపీచంద్- నయనతార చిత్రాన్ని ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేర్చాడు. ఎందరో దర్శకులు, ఎన్నో ఏళ్లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలై తెరమరుగవుతున్న బి.గోపాల్ కెరీర్‌లో దీపావళి వెలుగులు నింపుతుందనే ఆశతో కొందరు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక అప్పుడప్పుడు నేను కూడా లైన్‌లోనే ఉన్నానని చూపిస్తూ వచ్చే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ వయసులో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 'శిరిడిసాయి'. ఆయన ప్రస్తుతం మరలా నాగ్‌తో కలిసి మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాల్సివుంది.