మెగాస్టార్ చిరంజీవి కొంత విరామం తర్వాత నటిస్తున్న చిత్రం 'ఖైదీ నంబర్ 150'. టైటిల్లో కొత్తదనం లేనట్టే ఆయన లుక్స్ సైతం కొత్తగా లేవనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. 62 ఏళ్ళ వయస్సులో కూడా తనలో యంగ్ లుక్స్ ఉన్నాయనే భావన కలిగించే ప్రయత్నం చేశారు. గెటప్ కొత్తగా లేదని అంటున్నారు.. సినిమా ప్రారంభానికి ముందే రిలీజ్ చేసిన లుక్స్ మాదిరిగానే ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్ పెంచాలి. కాంబినేషన్ లుక్స్ రిలీజ్ చేస్తే జంట ఎలా ఉందనేది తేలుతుంది. ఈ విషయంలో యూనిట్ జాగ్రత్తలు తీసుకున్న ఛాయలు కనిపించడం లేదు. తన ప్రత్యర్థి సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రచార ఆర్భాటంతో పోలిస్తే 'ఖైదీ.. ' మాత్రం లో ప్రొఫయిల్ మెయింటెన్ చేస్తున్నాడు. అంచనాలు పెంచకూడదనే అభిప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ భారీ ఓపనింగ్స్ రావాలంటే హడావుడి కావాలి. ఖర్చు విషయంలో పరిమితులు పాటిస్తే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. నిర్మాతగా రామ్ చరణ్ కు అనుభవం తక్కువ ఆయన తన మామయ్య అల్లు అరవింద్ పై ఆధారపడినట్టు కనిపిస్తోంది. మొత్తం మెగా కుటుంబానికి 'ఖైదీ..' సినిమా కీలకం అనే విషయాన్ని కుటుంబం గుర్తించడం లేదు. పెద్దాయన (చిరంజీవి) సాధించే సక్సెస్ ఇతర మెగా హీరోలకు దశదిశనిర్దేశం అవుతుంది.