ఏ ముహూర్తాన మన జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించాలని నిర్ణయం తీసుకున్నాడో గానీ ఆయన జోరు చూస్తున్న వారంతా నోళ్లు వెల్లపెడుతున్నారు. 'లెజెండ్'తో మొదలైన జెబి దండయాత్ర తెలుగులో 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో పీక్స్‌కు వెళ్లింది. కేవలం తెలుగులోనే జగపతిబాబు అదరగొట్టడం లేదు.. అటు కోలీవుడ్, మాలీవుడ్‌లలో కూడా జెబి హవా జోరుగా సాగుతోంది. ఇక కన్నడలో కూడా జెబి సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఇవ్వన్నీ చూస్తుంటే ఇప్పుడు 'బాహుబలి' తర్వాత దక్షిణాదిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే ఎవరైనా జెబి పేరునే చెబుతారు. ఆయన కన్నడ, తెలుగుల్లో చేసిన 'జాగ్వార్' ఒక్క చిత్రాన్ని పక్కనపెడితే ఆయన తమిళంలో, మలయాళంలో హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. త్వరలో తమిళ స్టార్ విజయ్ హీరోగా 'భైరవ'చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో జగపతి మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇటీవల ఆయన మోహన్‌లాల్‌తో కలిసి మలయాళంలో 'పులి మురుగన్' చిత్రం చేశాడు. ఈ చిత్రం ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది. 'జాగ్వార్'లో కూడా ఆయన జయాపజయాలకు సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాడు. వీటితో పాటు త్వరలో టాలీవుడ్‌లో రూపొందుతున్న పలు భారీ చిత్రాలలో జగపతిబాబు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టనున్నాడు. ఈ క్రమంలో ఆయన ఎంత బిజీ అయ్యాడు అంటే కొన్ని స్టార్స్ చిత్రాలలో టైమ్ సరిపోక నో అని చెప్పేంతగా ఆయన సంచలనం సృష్టిస్తున్నాడు. మొత్తానికి జగపతిబాబు హవా ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఓ ఊపు ఊపుతోందని చెప్పాలి.