ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో పలువురు నక్సలైట్లు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మావోయిస్టు బలగాల్లో, రాష్ట్ర కమ్యూనిస్టు శ్రేణుల్లో కూడా తీవ్రమైన ఆందోళనకు గురి చేసే అంశం ఒకటుంది. అదేంటంటే.. ఏవోబీలో పోలీసులు, బలగాల కూంబింగ్ కాల్పుల అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే కనిపించకుండాపోవడం అందరినీ ఉత్కంఠతకు గురి చేస్తుంది. అయితే మావోయిస్టులు, రాష్ట్ర కమ్యూనిస్టు సానుభూతిపరులు ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతనికి ప్రాణ హాని ఉందని కూడా వెల్లడిస్తున్నారు. ఇంకా తమకు ఆర్కేను వెంటనే చూపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు పోలీసులు మాత్రం ఆర్కే తమ వద్ద ఏమాత్రం లేడని, ఇవన్నీ ఒట్టి ఆరోపణలేనని, తాము కూడా ఆర్కే కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నామని చెబుతున్నారు.
ఆంధ్రా, ఒడిస్సా పోలీసు బలగాలు ఏవోబీలో జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. అక్కడున్న ప్రతి ఇంటిని గాలిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆర్కేను ఈసారి ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే శనివారం ఆంధ్రాకు చెందిన స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, పోలీసు బలగాలను దశలవారీగా వాహనాలు, హెలికాప్టర్లలో పాడేరు, విశాఖకు తరలించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఆర్కే పోలీసుల వద్ద ఉన్నాడా? లేక తప్పించుకుని ఎక్కడైనా నక్కుకొని తిరుగుతున్నాడా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.