ఏ దేశానికైనా ఆ దేశం సాధించిన విజయాలు కీర్తిని తెస్తాయన్నది కాదనరాని సత్యం. ప్రపంచ దృష్టిలో ఆయా దేశాలు దేదీప్యమానంగా వెలుగొందాలంటే ఆ దేశాల రాణింపు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ రంగంలో అయినా అది సమానంగా వర్ధిల్లుతుంది. ఆయా రంగాల విజయాలతో ఆయా దేశాల కీర్తి ప్రతిష్ఠలు ఆధారపడి ఉంటాయి. అది ఎంతైనా ఆ దేశానికి గర్వ కారణమనే చెప్పాలి. అలా ఏ దేశంలోనైనా రాణించే రంగానికే, ప్రజాభిమానం, ప్రజల ఆసక్తి ఉన్న రంగానికే కీర్తి, గౌరవాలు ఆదరణ ఉంటుందన్నది కాదనిరాని సత్యం.
అయితే ప్రస్తుతం భారత్ దేశంలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. కానీ ఒక్క క్రికెట్టే కాకుండా భారతీయ క్రీడాకారులు ఈ మధ్య ప్రపంచ దేశాలతో కబడ్డీలో పోటీ పడిమరీ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత ప్రభుత్వం కబడ్డీ క్రీడాకారుల పట్ల చూపిన తీరును గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది. అద్భుత ప్రతిభను ప్రదర్శించి విశ్వవిజేతగా నిలిచిన కబడ్డీ క్రీడలకు ప్రభుత్వం ఇచ్చిన విలువను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ విషయం ఒక్కటి చాలు ప్రభుత్వం అన్ని క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయాలన్ని ప్రామాణికంగా చూపించడానికి. ఒకప్పుడు గ్రామాలలో గానీ, మండలస్థాయిలో గానీ, జిల్లా పరిషత్ స్కూళ్ళలో గానీ కబడ్డీ అంటే ఎనలేని క్రేజ్ ఉండేది. అది ఇప్పటికీ ఉంది. జనాదరణ ఉంది. కానీ దీన్ని బట్టి ప్రభుత్వాదరణే తగ్గిందని చెప్పవచ్చు. క్రికెట్ కు అయితే బాలు బాలుకి లక్షలు వెచ్చిస్తారు. అందులో సిక్స్ లకు, ఫోర్లకు సపరేట్ నజరానా అందజేస్తారు. అసలు క్రికెట్ ఆటగాడికి ఇచ్చినంత ఆదరణ గానీ, ధనం కానీ కబడ్డీ క్రీడాకారునికి ఎందుకివ్వడం లేదో అర్థం కాదు. తాజాగా వరల్డ్ కప్ గెలిచిన భారత కబడ్డీ క్రీడాకారులకు భారత క్రీడా శాఖ ప్రకటించిన నజరానా చూసి కబడ్డీ క్రీడాకారుల నోట మాటపడిపోయింది. క్రీడా శాఖ కబడ్డీ క్రీడాకారులకు అంటే జట్టులో అందరికీ కలిపి కేవలం పది లక్షల నజరానా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ సందర్భంగా విశ్వవిజేతగా నిలిచిన కబడ్డీ ఆటగాడు అజయ్ టాకూర్ మీడియాతో స్పందిస్తూ.. నిజంగా క్రీడా శాఖ ప్రకటించిన నజరానా తమకు చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, కేవలం రూ. పది లక్షల నజరానా ఇచ్చి అదీ జట్టు సభ్యులందరు పంచుకుంటే మనిషికి ఎంత వస్తుందని ఆవేదనతో మాట్లాడాడు. ఇప్పటికైనా క్రీడా శాఖ క్రీడలన్నింటినీ సమానంగా చూడాలని ఆయన వివరించాడు. ఇలాంటిదన్న మాట మన ప్రభుత్వాలు క్రీడల పట్ల చూపే సమాన ప్రాధాన్యత అంటూ కబడ్డీ అభిమానులు ఖంగుతింటున్నారు.