మన హీరోలు ఫైటింగ్స్, చేజింగ్స్.. ఇవి ఎలా ఉన్నా ఒప్పుకుంటారు కానీ పాటల విషయంలో మాత్రం డిఫరెంట్ లొకేషన్లు లేకపోతే అసలు కాంప్రమైజ్ అవ్వరు. అందుకే ఎలాంటి చిత్రాలకైనా అద్బుతమైన లోకేషన్లు ఉన్న దేశానికి చలో అంటారు. యుఎస్, యుకె, యూరప్‌లను వదలని మన హీరోలు తాజాగా 'ఉక్రెయిన్' బాట పట్టారు. ప్రస్తుతం రజనీకాంత్, అమీజాక్సన్‌ల కలయికలో రూపొందుతున్న 'రోబో2.0' చిత్రం కూడా ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఓ పాటను చిత్రీకరించుకుంటోంది. పాటలు అంటే శంకర్ ఇక హద్దులు మీరి నిర్మాతల ఆస్ధులు అమ్మైనా సరే భారీ సెట్టింగ్స్, ఏడు వింతలు.. ఇలా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లను ఎంచుకుంటూ ఉంటాడు. అలాంటి శంకర్ ఉక్రెయిన్ బాట పట్టడంతో ఇప్పుడు మన మెగాహీరోలు కూడా ఆ దేశాన్ని దత్తత తీసుకుంటున్నారు. త్వరలో చిరంజీవి - కాజల్ జంటగా 'ఖైదీ నెం 150' చిత్రంలోని పాటల కోసం ఈ చిత్ర యూనిట్ ఉక్రెయిన్ వెళ్లనుంది. ఇక మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న 'ధృవ' చిత్రంలోని ఓ పాట కోసం త్వరలో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు ఉక్రెయిన్ వెళ్తున్నారు. మరోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా రూపొందుతున్న 'విన్నర్' చిత్రంలోని మూడు పాటలను కూడా రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి సాయి ఉక్రెయిన్‌లోనే స్టెప్పులు వేయనున్నాడు. మొత్తానికి భారతదేశ దక్షిణాది సినీ పరిశ్రమ ప్రస్తుతం ఛలో ఉక్రెయిన్ అంటోంది.