జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై మరోసారి సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని నలుదిశలా వినపడేలా ఎలుగెత్తి చాటనున్నాడు. అందుకు ఇన్నాళ్ళు చల్లారిపోయాడు చల్లారిపోయాడు అనుకుంటున్న జనసేనాని ఉద్యమం రూపంలో మరోసారి ప్రజల్లోకి వచ్చి సభ జరపనున్నాడు. నవంబర్ 10న అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఈ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా పేరు కూడా పెట్టాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన విప్లవ రచయిత అయిన తరిమెల నాగిరెడ్డి పేరును ఈ సభా ప్రాంగణానికి పెట్టడం ఎంతైనా ముదావహం. కాగా ఆ రోజు సాయంత్రం 4గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఊకదంపుడు ఉపన్యాసాలతో హడావుడి చేసి అభిమానుల్లో ప్రత్యేక హోదా వస్తే బాగుంటుంది అన్న భావనను రేపేలా ప్రసంగించనున్నాడు. ఆ తర్వాత చల్లారి పోవడం ఎవరి పనిలో వాళ్ళు పడటం సదా మామూలే. గతంలో పవన్ చేపట్టిన రెండు భారీ బహిరంగ సభలు తర్వాత ఇదే విషయాన్ని గమనించాం.
ఇది కాసేపు పక్కన బెడితే మాటిమాటికి సమాజంపై, సమాజాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలపై, ప్రభుత్వంతో ప్రజలను శాసిస్తున్న పార్టీలపై, ఆయా పార్టీ ప్రజాప్రతినిధులపై విప్లవ నాయకుడిలా చెలరేగిపోయే పవన్ కళ్యాణ్ ఆయన ఏమనుకుంటున్నాడు?. ఎందుకు ఇటువంటి సభలు, సమావేశాలు నిర్విహిస్తున్నడు?. ఇటువంటి భారీ బహిరంగ సభలద్వారా ఏమైనా సాధిస్తున్నాడా? లేదా? అన్న విషయాన్ని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైక్ దొరికితే నాయకులపై మండిపడితున్న పవన్ కళ్యాణ్ తాను ఓ పార్టీ అధినేతగా ఏ భావంతో ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడో తెలియదుగానీ అసలు అన్నీ తెలిసినట్లుగా మాట్లాడే పవన్ కి తెలియదా ఎలా ప్రత్యేక హోదాని సాధించాలి అనే విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా సాధించాలన్న చిత్తశుద్ధే ఉంటే కేంద్రానికి తన జనసేన పార్టీ తరఫున సపోర్టు ఇచ్చిన వ్యక్తి అదే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడి వద్దకు ఈ విషయంపై వెళ్ళి ఎందుకు మాట్లాడటం లేదన్నది ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చినీయాంశంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ జరిపిన తిరుపతి సభ అటుంచితే, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాతనే కాకినాడలో సభ జరిపాడు. అక్కడ కేంద్రం రెండు పాచిపోయిన లడ్డూలు పడేచింది అన్నాడు కానీ హోదా సాధించేందుకు తానుగా చేస్తున్న బలమైన ప్రయత్నాలు ఏమిటో వెల్లడించకపోవడం, అరకొరగా అంచలంచలుగా ఉద్యమాన్ని చేసి కేంద్రంపై వత్తిడి తెస్తామని చెప్పినా, అది జరగడంలో జాప్యం కారణంగా మళ్ళీ వ్యవహారం ఎప్పటికప్పుడు మొదటికి వచ్చేస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఇలా జరగడం ఎంతైనా శోచనీయం. అసలు పవన్ ఇలాంటి సభల ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాడు?. ప్రజలందరికీ హోదా అవసరాన్ని తెలిపి అందుకు అనుగుణంగా పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధమౌతున్నాడా? అంటే అందుకు తగినంత క్యాడర్ జనసేనకు ఉందా అని సందేహం కలుగుతుంది. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ప్రజల్లో మన పార్టీ కూడా ఉందని తెలియజేయడానికి, తాము కూడా హోదాకోసం పోరాడుతున్నామని ఉనికి కోసం పాటు పడుతున్నాడా?. అలాగే అయితే ఆ దిశగా ఎందుకు నిరంతరం ప్రయత్నాలు జరపడం లేదు. అలాగే భావించి జనసేన కూడా ఇదీ ఇంకో పార్టీ అనే భావనే ప్రజల్లో కలుగుతుంది. అలా కలగకుండా నాన్చుడు రాజకీయాలు చేస్తూ, నిరంతరం సమస్య ఉన్నప్పుడే మనం మన పార్టీ ప్రజల్లో ఉంటుంది అనే భావంలో పవన్ కళ్యాణ్ ఉంటే ఏపీ ప్రజలు ఆలోచనలో పడే ప్రమాదం ఎంతైనా ఉంది. ఇప్పటివరకు కేవలం పవన్ సభల ద్వారా మావో, చెగువేరాలా సభలతో జనాన్ని ప్రభావితం చేయాలని భావిస్తే, ఆ దిశగా నాలుగు పుస్తకాల్లోని వారి దృక్పధానలను బట్టిపట్టుకొని వచ్చి జనాలను రెచ్చిగొట్టి ఆ కాసేపు వేడిని రగిలించి మరుక్షణంలోనే ఆ వేడిని చల్లార్చి వేయడం జరుగుతుంది. ఇప్పడు పవన్ చేస్తున్న, జరుపుతున్న విధానం చూస్తే అలాగే ఉంది. ప్రజల్లో తన పోరాట భావాన్ని రగిలించి అదే పనిగా ఉండి సాధించేవరకు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాడు పవన్. మిగతా పార్టీలకంటే భిన్నంగా ఆయన ప్రజా ఉద్యమాన్ని ఎందుకు నడపలేకపోతున్నాడు. తన నోటి నుండే గతంలో ఏపీలో ఓ పార్టీ అవినీతిలో కూరుకుపోయి ఉంటే, మరో పార్టీ ఓటుకు నోటులో మునిగిపోయింది, ఇక వీళ్ళేమి పోరాటాలు చేస్తారు అన్నాడు. ఏమీ అంటని నిజాయితీ పరుడైన పవన్ ఇప్పుడు తానుగా చేస్తున్నదేమిటి? తాను జరిపే సభలకు విప్లవ నాయకుల పేర్లు పెట్టినంత మాత్రాన సాధించినట్లుగా సంతృప్తి చెందుతున్నాడా? అలాగే ఉంది పవన్ విధానాలను, అవలంభిస్తున్న నాటకీయ పరిణామాలను చూడబోతే. అలా కాకుండా పవన్ బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న పార్టీలకు అతీతంగా పోరాడి ఏదైనా ఒక సమస్యను పరిష్కరిస్తే నిజంగా పవన్ జనసేన గ్రేట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి ఉపన్యాసాలే చేస్తూ పోతుంటే ఇదీ మరో పార్టీ అంతే అంటారు ప్రజలు.