తెలుగు వారంతా కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలంలో ప్రత్యేక తెలంగాణ కోసం రాజకీయంగా కెసిఆర్ ఎలాంటి వ్యూహాన్ని అవలంభించాడో అలాంటి విధానాన్ని ఆచరించేందుకు సిద్ధమౌతున్నాడు వైకాపా అధినేత జగన్. రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా అంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టాలన్న తలంపుతో ఉన్న జగన్ ఆ దిశగా చకచకా అడుగులు వేస్తున్నాడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సాధకబాధకాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటున్నాడు జగన్. గత కొంత కాలంగా జగన్ వేస్తున్న అడుగులు, పార్టీపరంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా ఈ సారి ఎన్నికల కోసం జగన్ నిర్మాణాత్మకమైన వైఖరితో ముందుకు వెళ్తున్నారనే విషయం అర్థమౌతుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో అన్నిచోట్లా వ్యవస్థ అతలాకుతలంగా తయారైంది. ఏదో విధంగా పాలన సాగుతున్నా ప్రజలు భావించినంతగా మరింత ఆశాజనకంగా అభివృద్ధి జరగడం లేదనేది రాజకీయ విశ్లేషకుల భావన. కాగా ఇదో అవకాశంగా భావించిన జగన్ ఈ మధ్య కాలంలో ప్రజలను, వారి జీవన విధానాన్ని అతి దగ్గరగా చూస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఆ దిశగా ఆంధ్ర ప్రజల్లో ప్రధానంగా నాటుకుపోయిన ప్రత్యేక హోదా విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు, సభా కార్యక్రమాలు నడుపుతున్నాడు జగన్. ప్రజల గొంతుక తోడుగా వారి అబిప్రాయలను నిత్యం తెలుసుకుంటూ ఆ దిశగా ప్రత్యేక హోదాపై ప్రజలను రగిలించి ప్రజల్లో పార్టీని బలంగా స్థాపించేలా చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు జగన్. ఆ రకంగా ప్రజా ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వచ్చే ఎన్నికల నాటికి చాలా బలంగా ముందుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాడు జగన్. దీన్ని బట్టి చూస్తే జగన్ వ్యూహం గతంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఎలాంటి వ్యూహాన్నైతే అవలంభించాడో అదే రకమైన అటువంటి వ్యూహాన్నే జగన్ ఫాలో అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఒకానొక దశలో ఎంపీలతో రాజీనామా చేయించడం వంటివి చేశారు. ప్రభుత్వాన్ని చాలాసార్లు స్తంభింపజేశాడు. అలా ఎన్నోరకాలుగా ఎత్తులకు పైఎత్తులు వేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా అవతరించాలన్న ఆకాంక్షను నరనరాన నూరిపోసి అలా సాధించాడు. అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కెసిఆర్ ఓ శక్తిలా మారిపోయాడు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా అనే ఆయుధంతో జగన్ కూడా ఓ శక్తిలా ప్రజల్లో మారిపోవాలనే వ్యూహాన్ని పన్నుతున్నట్లుగా తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే అర్థమౌతున్న విషయం. అందుకే తాజాగా జగన్ ప్రత్యేక హోదాకోసం తమ పార్టీ ఎంపీలను రాజీనామా చేయిస్తానంటూ వెల్లడిస్తున్నాడు. ఇంకా ప్రత్యేక హోదా అనే ఆయుధంతో జగన్ ఎటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కుంటాడో వేచి చూడాలి.
Advertisement
CJ Advs