ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అధికారం కోసం తండ్రి (ములాయం సింగ్) కొడుకు (అఖిలేష్) మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. సమాజ్ వాది పార్టీ స్థాపకుడు ములాయం. గత ఎన్నికల్లో గెలిచాక సీఎం పీఠం కొడుకుకు అప్పజెప్పారు. పార్టీ మీద మాత్రం తన ఆధిపత్యమే ఉంది. అఖిలేష్ పాలన, అవినీతి ఆరోపణలు, దళితులపై దాడులు, తన వర్గాన్ని నిర్లక్షం చేయడం వంటి కారణాలు ములాయంకు కోపం తెప్పించాయి. అవి అఖిలేష్ పీఠానికి ఎసరుపెట్టే వరకు చేరాయి. పార్టీ క్యాడర్ తండ్రి, కొడుకు వర్గాలుగా చీలింది. చివరికి పార్టీ చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ నేటి రాజకీయానికి, ఇరవై ఏళ్ళ క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముసలానికి దగ్గర సంబంధం కనిపిస్తోంది. మామ (ఎన్టీఆర్) వ్యవహారశైలి నచ్చని అల్లుడు (చంద్రబాబు) తిరుగుబాటు చేశారు. పార్టీలో చీలిక తెచ్చారు. లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని, మామ పీఠానికి ఎసరు పెట్టారు. చివరికి ఎన్టీఆర్ ను పదివిచ్చుతుని చేశారు. ముఖ్యమంత్రి అయ్యారు. అధికారం కోసం రాజకీయాల్లో రక్తసంబంధం, కుటుంబసంబంధం ఉండదని నాడు చంద్రబాబు, నేడు అఖిలేష్ నిరూపించారు.