'బాహుబలి' మేకర్స్ రూటే సపరేట్. సినిమా నిర్మాణం కోసం కోట్లు ఖర్చుపెడుతున్న నిర్మాతలు, ఆ సినిమా ప్రచారాన్ని మాత్రం ఉచితంగా పొందుతున్నారు. ఇలాంటి తెలివితేటలు ఇంతకాలం రామ్ గోపాల్ వర్మకే ఉన్నాయనుకుంటే ఇప్పుడు 'బాహుబలి' మేకర్స్ సైతం ఫాలో అవుతున్నారు. విషయం ఏమంటే ఆదివారం యంగ్ రెెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. నేటితో 36 సంవత్సరాలు నిండుతాయి. సహజంగా రన్నింగ్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే తమ హీరోకు బర్త్ డే గ్రీటింగ్ చెబుతూ, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం టాలీవుడ్ సంప్రదాయం. ఇది దాదాపు ప్రతి హీరో విషయంలో జరుగుతుంది. కానీ 'బాహుబలి' నిర్మాతల రూటేవేరు కాబట్టి బర్త్ డే గ్రీటింగ్స్ ప్రకటన ఇవ్వడానికి నిర్మాతలు లెక్కలు వేసుకున్నారు. హీరో బర్త్ డే కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి మనసొప్పలేదు. దీనికి బదులుగా 'బాహుబలి 2' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో లుక్ కాబట్టి మీడియా ప్రచురిస్తుంది. దాంతో ఎలాంటి ఖర్చు లేకుండానే తమ హీరోకు గ్రీటింగ్ చెప్పిన ఘనత సొంతం అవుతుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా మీడియా మాత్రం మంచి కవరేజ్ ఇచ్చింది. జీనియస్, క్రియేటివ్ వంటి బిరుదులు అందుకున్న దర్శకుడు రాజమౌళికి, ఆయన నిర్మాతలకు ఉన్న ఈ తెలివితేటలు ఇతర నిర్మాతలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.