నిజమాబాద్ ఎం.పి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆస్తుల ప్రస్తావన ప్రకటన గురించి లోకేష్ ను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. తమకు ఆస్తులు ప్రకటించి అన్నాహజారే అనిపించుకోవాలని లేదని, ఆదాయపన్ను శాఖకు వివరాలు వెల్లడిస్తున్నామని అన్నారు. అయితే ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబు దారిగా ఉండాలి. ఐటి రిటర్న్స్ సామాన్యులు సైతం దాఖలు చేస్తున్నారు. అదేమి గొప్ప విషయం కాదు. ప్రజా జీవితంలో ఉన్నవారు మాత్రం ప్రజలకు తమ ఆస్తుల వివరాలు తెలియజేయాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో నామినేషన్ తో పాటుగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తారనే విషయం కవితకు తెలియంది కాదు. అప్పుడు చెబుతున్న వివరాలను బహిరంగంగా ప్రజలకు తెలిపితే తప్పేమిటనే విషయాన్ని ఆమె విస్మరించారు. పైగా ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు కుంటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు.
బహిరంగంగా తమ ఆస్తులు వెల్లడిస్తే ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదనే సదుద్దేశంతోనే విపక్షాలు అడుగుతుంటాయి. అంతేకానీ అన్నా హజారే అనిపించుకోవడం కాదనే విషయం కవితకు తెలియంది కాదు.