తమిళనాడు రాష్ట్రంలో డీయంకే అధినేతగా కరుణానిధి తర్వాత ఎవరుంటారు అన్న విషయంపై చాలా కాలం నుండి ఆధిపత్యపోరు నడుస్తూ ఉంది. స్టాలిన్ తన రాజకీయ వారసుడంటూ కరుణానిధి ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేయడంతో ఎన్నాళ్ళ నుండో కొనసాగుతున్న అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరుకు తెరపడినట్లయింది. కరుణానిధి కుమారుల్లో పెద్దకుమారుడు అళగిరి తండ్రి వారసత్వం కరుణానిధి తర్వాత తనదేనంటూ ఆశించిన విషయం తెలిసిందే. అలా అనుకున్నా ఎక్కడో కరుణానిధిపై అళగిరికి గతంలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి నమ్మకం కలగలేదు. అలా గత ఎన్నికల్లో కూడా అళగిరికి బాగా పట్టున్న దక్షణ తమిళనాడు ప్రాంతాన్ని అంతగా పట్టించుకోకుండా పార్టీ పట్ల అయిష్టతను చూపాడు. కరుణానిధి ఎప్పటికైనా స్టాలిన్ నే వారసుడిగా ప్రకటిస్తాడని అళగిరి అలుగుడు అది. అయితే అనుకున్నట్లుగానే కరుణానిధి తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించి హఠాత్తుగా స్టాలిన్ తన రాజకీయ వారసుడు అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తాడు. కరుణానిధి మాట్లాడుతూ... అలాగని తాను అప్పుడే రాజకీయాల నుండి రిటైర్మెంట్ కావడం లేదంటూ కూడా ప్రకటించేశాడు.
ఇంకా కరుణానిధి స్పందిస్తూ... డీయంకే పార్టీ కార్యకలాపాలలో స్టాలిన్ మొదట్నుంచి చాలా చురుకుగా పొల్గొనేవాడని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పార్టీకోసం కష్టపడ్డాడని, తాను ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానంటే అందుకు కారణం స్టాలినేనంటూ వెల్లడించాడు. కాగా డీఎంకే పార్టీ పగ్గాలను స్టాలిన్ కు అప్పగించడంపై పార్టీ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
CJ Advs