జర్నలిజంలో కనీస విలువలు సైతం పాటించని ఘనత 'నమస్తే తెలంగాణ' పత్రికకు చెందుతుంది. మూడు నెలల క్రితం జరిగిన నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత అతడి గ్యాంగ్ స్టర్ గురించి అనేక కథనాలు వచ్చాయి. దీనికోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మంగళవారం నాడు సిట్ తన ప్రాధమిక నివేదికను కోర్టుకు సమర్పించి, నయీమ్ కు అంటకాగిన రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల పేర్లు వెల్లడించింది. ఈ విషయాలు అన్ని దిన పత్రికలు వివరంగా ప్రచురించాయి. కానీ 'నమస్తే తెలంగాణ' మాత్రం వార్తను తొక్కి పెట్టింది. కేవలం నాలుగు లైన్లలో సింగిల్ కాలమ్ ఐటమ్ ఇచ్చింది, ముద్దాయిల వివరాలను దాచిపెట్టింది. ప్రతి రోజు విలువల గురించి రాసే నమస్తే.. నయీమ్ అరాచకాలను దాచిపెట్టడం వెనుక మతలబు ఏమిటనే? అనుమానం కలుగుతోంది. నేతల్లో తెరాసకు చెందిన మండలి డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ ఉండడమే కారణమని స్పష్టమవుతుంది. ఇంకా పోలీస్ అధికారుల పేర్లు కూడా నొక్కిపెట్టి జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చింది.
ప్రజలకు నిజాయితీ కూడిన వార్తలు ఇవ్వాల్సిన 'నమస్తే తెలంగాణ' నయీమ్ విషయంలో మాత్రం అనుమాన స్పద వైఖరి ప్రదర్శించింది. తెరాసకు, కేసీఆర్ కు ప్రతిరోజు భజన చేస్తూ, వాస్తవాలు కప్పిపుచ్చుతున్న 'నమస్తే...' పత్రిక క్రిమినల్స్ విషయంలో కూడా కప్పదాటు వైఖరి ప్రదర్శించడం విచిత్రం. ప్రతిపక్షాలను అభాసుపాలు చేయడంలో చూపించే ఆసక్తి, వాస్తవాలు ప్రచురించడంలో కూడా చూపిస్తే మంచిదని ఆ పత్రిక ఎడిటోరియల్ బోర్డు గమనిస్తే మంచిది.