కొత్త ఏడాది సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ మంచి రంజుగా ఉండేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి', చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' చిత్రాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. తాజాగా సంక్రాంతి పోటీలో మరో కోడిపుంజు చేరనుంది. వెంకటేష్ నటిస్తున్న రీమేక్ సినిమా 'గురు' కూడా ఆ రెండు చిత్రాలతో పాటుగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు రిలీజ్ కావడం కొత్తకాదు. ఈ ఏడాదిలో కూడా 'నాన్నకు ప్రేమతో', 'ఎక్స్ ప్రెస్ రాజా', 'డిక్టేటర్', 'సోగ్గాడే చిన్నినాయన' వంటి చిత్రాలు వచ్చాయి.
అయితే సంక్రాంతి 2017 మాత్రం కొంత భిన్నంగా పోటీ ఉంటుందనుకోవచ్చు. బాలకృష్ణ నూరవ చిత్రం 'శాతకర్ణి'. భారీ వ్యయంతో తీస్తున్న చారిత్రాత్మక కథా చిత్రం. ఇది బాలకృష్ణకు ప్రతిష్టాత్మకం. ఇక తొమ్మిదేళ్ళ గ్యాప్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' చిత్రం. ఆయనకు ఈ సినిమా సక్సెస్ అవడం అత్యంత ప్రధానం. ఇప్పటికే భారీ పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో వెంకటేష్ సినిమా సైతం చేరడంతో ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. ఈ మూడు కోడిపుంజుల్లో ఎవరు గెలుస్తారనేది చర్చకు దారితీస్తోంది. పైగా వీటికి థియేటర్ల సమస్య తప్పదు. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి ఓపనింగ్స్ రాబట్టాలనేది అందరియత్నం. కానీ మూడు భారీ సినిమాలుంటే థియేటర్లను పంచుకోవాల్సి వస్తుంది. లేదా గతంలో పరస్పర అంగీకారంతో రెండు వారాల వ్యవధిలో సినిమాలు విడుదల చేసుకునేలా ఒప్పందం చేసుకోవాలి. కానీ ఇది జరుగుతుందా? స్టార్ హీరోలు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడతారా అనేది అనుమానమే.
Advertisement
CJ Advs