తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరి ఇంచుమించు నెల కావస్తుంది. జయలలిత ఆరోగ్యం మెరుగు పడుతుందని, అతి త్వరలోనే ఆమె కోలుకొని డిశ్చార్జ్ అవుతారని అధికార పక్షం అన్నాడీఎంకే పార్టీ నేతలంతా పైకి చాలా గంభీరంగా తెగ చెప్పేసుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం అసలేం జరుగుతుందన్నది ఏ ఒక్కరికీ తెలియనివ్వడం లేదు సరికదా, అసలు బయటికి పొక్కనీయడం లేదు. చిన్నచిన్నగా జయలలిత అధికార పగ్గాల్ని మాత్రం ఆమె విధేయుడైన పనీర్ సెల్వంకి అప్పగించారు. కానీ ఇక్కడ ఇంకా ప్రజలకు అంతుపట్టని విషయం ఏంటంటే..అసలు ఈ నాయకులు గానీ, అధికారులు గానీ, అపోలో వర్గాలు గానీ జయలలిత ఆరోగ్యం గురించి ఇంతలా రహస్యాన్ని పాటిస్తున్నారేమిటి అన్నదే. ఆమె నిజంగానే అదృష్టవశాత్తు కోలుకుంటున్నట్లుగానే ఉంటే కనీసం ఆసుపత్రి వర్గాలు చికిత్స పొందుతున్నప్పటి ఫోటోలనైనా విడుదల చేయాలి కదా, అలా కూడా ఎందుకు చేయడం లేదన్నదే ఇక్కడ అందరినీ తొలిచి వేస్తున్న ప్రశ్న. ఇలాంటి సందర్భంలో తమిళనాట ప్రజలంతా ఓ విధమైన ఉద్రేక భావానికి లోనై ఉన్నారన్న విషయం మాత్రం నిజం.
ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీకి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దిశగా చూసుకుంటే ప్రస్తుతం తమిళనాడును కేంద్రమే పాలిస్తుందని చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనంగా తమిళ రాష్ట్రాన్ని ఇంతకాలం గవర్నర్ గా పనిచేసిన రోశయ్యను తప్పించిన భాజపా అధిష్టానం హడావుడిగా తమ పార్టీకి చెందిన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావును ఇంచార్జి గవర్నర్ గా నియమించింది. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన గవర్నర్ అయితే ప్రమాదం ఏ రకంగానైనా ఉండచ్చన్నది భాజపా అభిప్రాయం కాబోలు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో జయలలిత ప్రాణాలతో బయటపడే ఆశలు, అవకాశాలు మాత్రం రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. ఓ రకంగా చూస్తే జయలలిత పరిస్థితి విషమించిందనే చెప్పవచ్చు. అధికారికంగా తెలిపేందుకు పార్టీ, అధికార వర్గాలు సందేహిస్తున్నా అనధికారికంగా వార్తలు మాత్రం విస్తరిస్తూనే ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గతంలో పుట్టపర్తి సాయిబాబా మరణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినట్లుగానే ప్రస్తుతం జయలలిత పట్ల భాజపా వ్యవహరిస్తుందని కూడా వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం ఇటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేకున్నారు.