వైకాపా అధినేత జగన్ కు కృష్ణాజిల్లా నుండి మరో షాక్ తగిలేలా ఉంది. గత సాధారణ ఎన్నికల్లో వేదవ్యాస్ వైకాపా నుండి పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి మాజీ డిప్యూటీ స్పీకర్ అయిన బూరగడ్డ వేదవ్యాస్ తెదేపా తీర్థం పుచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుపుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ నెల 21వ తేదీ వేదవ్యాస్ తెదేపాలో చేరేందుకు ముహూర్తం కూడా ఖాయమైందని తెలుస్తుంది. అందులో భాగంగానే వేదవ్యాస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా వైకాపా తరఫు నుండి పోటీ చేసి ఓటమి చెందినప్పటి నుండి వేదవ్యాస్ ఆ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొనడం లేదు. పైగా వేదవ్యాస్ పార్టీ మారతాడన్న ప్రచారం ఎప్పటి నుండో ఉన్నప్పటికీ ఈ సమయంలో అది బయటికి రావడం తెదేపా స్ట్రేటజీలో భాగంగానే చెప్పవచ్చు. ఎప్పుడు, ఎవరిని దేనికోసం ఎలా తీసుకోవాలో తెదేపా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు పోతుందన్నది ఈ విషయాన్ని బట్టి చూస్తే అర్థమౌతుంది.
కాగా వేదవ్యాస్ పార్టీ మార్పిడికి సంబంధించి పెడన నియోజకవర్గంలోని శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. వారి ముందు ఆయన మాట్లాడుతూ వైకాపాలో తనకు అవమానాలు, ఛీత్కారాలు ఎదురౌతున్నాయని వాటిని భరిస్తూ ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదని ఉద్వేగంతో వెల్లడించాడని తెలుస్తుంది. ఇంకా వేదవ్యాస్ కుమారుడు, నారా లోకేష్ ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో ఆ రకంగా లోకేష్ జరిపిన రాయభారంలో భాగంగా వేదవ్యాస్ తెదేపా తీర్థం పుచ్చుకుంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది.