హీరో ఆది పినిశెట్టి విషయానికి వస్తే ఆయన తెలుగులో హీరోగా చేసిన చిత్రం 'ఒక విచిత్రం' ఫ్లాప్ అయింది. దీంతో ఆది పినిశెట్టి తమిళంలోకి ప్రవేశించి నటునిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన నటించిన 'మృగం' చూస్తే ఎవరికైనా ఆది పినిశెట్టి టాలెంట్ ఏమిటో తెలుస్తుంది. అందుకే హీరోగానే కాకుండా నటనకు స్కోప్ ఉన్న ఏ పాత్రలైనా సరే ఆయన తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే ఆయన బోయపాటి డైరెక్షన్‌లో సూపర్‌హిట్ అయిన 'సరైనోడు' చిత్రంతో తన పాత్ర ద్వారా తెలుగు ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. కాగా ప్రస్తుతం ఆయన మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో మరోసారి విలన్ పాత్రను చేస్తున్నాడు. అదే కాకుండా నాని హీరోగా తెరకెక్కుతున్న 'వీడు లోకల్'లో కూడా ఆది పినిశెట్టి కీలకపాత్రను చేస్తున్నాడు. తమిళంలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఆది టాలీవుడ్‌లో తన జర్నీ ఎలా కొనసాగాలనే విషయంపై తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు.