మోడి మాటకు ఓ విలువ ఉంది. అది అధికారంలో ఉన్నారని కాదు కానీ, కొంతమంది మాటలు అధికారంలో ఉన్నా లేకున్నా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. బుల్లెట్ లా దూసుకుపోయే ఆ మాటలు ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా మోడీ భోపాల్ లో శౌర్య స్మారకాన్ని ప్రారంభించాడు. అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ సైన్యం కీర్తిని, సైనికుల ఘనతను చాలా గొప్పగా వివరించాడు. మోడీ ఎప్పుడూ చాలా గొప్ప విషయాలను కూడా చాలా సింపుల్ గా చెప్పేస్తాడు. సైన్యం సామాన్య ప్రజల సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటుందని, ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తే సైన్యం చాలా ఆనందిస్తుందని వివరించాడు. అలాంటిది ప్రజలు జాగురుకతతో ఉండాల్సిన సమయంలో కూడా నిద్రపోతే అప్పుడు సైన్యం బాధపడుతుందని వెల్లడించాడు. భారత ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే అందుకు కారణం భారత సైనికుల త్యాగ ఫలితాలేనని మోడీ తెలిపాడు. కాగా భారత సైనికులు జరిపిన సర్జికల్ దాడుల గురించి ప్రస్తావిస్తూ సైనికులు జరిపిన వీర పోరాటాన్ని పొగుడుతూ... మన సైనికులు మాటలు చెప్పరు, చేతలనే చూపుతారు అంటూ వెల్లడించాడు.
ఇంకా మోడీ మాట్లాడుతూ మన సైనికుల మానవత్వపు కోణాన్ని గొప్పగా విశ్లేషించాడు. రెండేళ్ళ క్రితం శ్రీనగర్ మొత్తాన్ని భారీ వరదలు ముంచెత్తినప్పుడు ప్రభుత్వం ఆ స్థితిని మొత్తాన్ని చక్కదిద్దడం చాలా కష్టమైంది. అప్పుడు మన సైనికులు దగ్గరుండి శ్రీనగర్ ప్రజలను వరదల నుండి కాపాడారు. అలాంటి మన సైనికులను అక్కడి కొంతమందే రాళ్ళు రువ్వడం, తలలు పగలు కొట్టడం, దృష్టిని కోల్పోయేలా చేయడం వంటివి తాము ఊహించని పరిణామాలుగా మానవత్వాన్ని మరచి చేసే పనులుగా ఆయన వివరించాడు. మోడి యెమన్ లో వచ్చిన అసాధారణ పరిస్థితి ప్రకృతి విపత్తు విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు 5వేల మంది భారతీయులను రక్షించిన మన సైన్యం తెగువను కొనియాడారు. అందులో పాకిస్తానీయులు కూడా ఉన్నారని, ప్రజలను కాపాడటంలో మన సైన్యం తన మన అన్న భేదాలను పట్టించుకోదని ఆయన వివరించాడు. అలాంటి ఉదారత కలిగింది మన సైన్యం అంటూ మోడి ప్రశంసల వర్షం కురిపించాడు.