నల్లధనం అంశం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. నల్లధనంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ లో 13 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని ప్రకటిస్తే అందులో ఒక్క జగన్ దే 10 వేల కోట్ల వరకు ఉందని పరోక్ష విమర్శలు చేశాడు. దానికి దేవినేని ఉమ కూడా స్వరం పెంచి డైరెక్టుగా జగన్ పై ప్రత్యక్ష ఆరోపణలు చేశాడు. దీంతో జగన్ కి మండింది. నల్లధనం అంశంపై వాస్తవాలను వెల్లడించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాశాడు. అదేవిధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల విచారణ జరిపి ఆ 10 వేల కోట్ల రూపాయలు ప్రకటించిన వ్యక్తి బాబు బినామీ పేరు కూడా బయట పెట్టాలని జగన్ అందులో వెల్లడించాడు. కాగా ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండవల్లి అరుణ్ కుమారు కూడా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశాడు.
ఉండవల్లి అసలే లా చదివాడు కదా, అందుకనే లాజికల్ గా మాట్లాడుతూ ..చంద్రబాబు చెబుతున్న నల్లధనం ప్రకటించిన వ్యక్తుల పేర్లను వారి జాబితా ఆయనకు ఎలా తెలిసిందని, కేంద్రం లోపాయికారిగా వెల్లడించిందా లేదా చంద్రబాబు అబద్దాలు మాట్లాడుతున్నాడా అన్న విషయంపై కేంద్రం విచారణ జరపాలని ఉండవల్లి వివరించాడు. చంద్రబాబు చెబుతున్నట్లుగా 10 వేల కోట్ల రూపాయలు ప్రకటించిన ఆ వ్యక్తి పేరును బయట పెట్టడం జరగదని పైకి కేంద్రం చెబుతూనే లోపల తాను అనుకున్న వారికి అందిస్తూనే ఉందని ఉండవల్లి మండిపడ్డాడు. ఇలా జగన్ తర్వాత ఉండవల్లి ఆ తర్వాత వైకాపా స్వరాలు నల్లధనంపై రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా జగన్ అనుసరిస్తున్న ప్రతి వ్యూహంలోనూ ఉండవల్లి పాలుపంచుకోవడం విశేషంగానే చెప్పవచ్చు.