ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు బాగా డబ్బులు సంపాదించడంలో పోటీ పడుతున్నారని, పని విషయంలో ఆశ్రద్ధ కనబరచారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఎన్నికల్లో ఓటుకు 500, 1000 రూపాయల వరకు ఇస్తున్నారని, తిరిగి అదంతా సంపాదించుకొనేందుకు ఎమ్మెల్యేలు అంతా పోటీ పడాల్సి వస్తుందని ఆయన ఉద్దేశం. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. వెలగపూడితో తన చాంబర్ ను ప్రత్యేక పూజలు జరిపి మరీ ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంకా బాబు మాట్లాడుతూ కొన్ని పత్రికలను చూస్తుంటే భయమేస్తోందని, మనసు పాడయి పోతుందంటూ వెల్లడించాడు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఏ పార్టీకైనా సొంతంగా పేపర్లు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించాడు. పత్రిక, టీవీ ఉన్నంత మాత్రాన అధికారంలోకి రావడం అవివేకమే అవుతుందన్నాడు.
అయితే బాబు చెప్పిన ఒక విషయం మాత్రం సంచలనానికి దారితీస్తుంది. అది జగమెరిగిన సత్యమే అయినా చంద్రబాబు నోటి నుండి ఆ మాట రావడంతో అందరూ అవాక్కవుతున్నారు. అదేమంటే కేవలం నల్లధనాన్ని సంపాదించుకునే వారికి రాజకీయాలు అడ్డాగా మారుతున్నాయన్నాడు. ఇంకా బాబు మాట్లాడుతూ తనకు ఎలాంటి స్వార్థం లేదని, సమస్యలు సృష్టిస్తే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన వివరించాడు. కాగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఎమ్మెల్యేలు సంపాదనలో పోటీ పడుతున్నారని దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేయడం పట్లు అటు నాయకులు ఇటు ప్రజలు ఆశ్చర్యానికి లోనౌతున్నారు.