కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం సాంప్రదాయ రీతిలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈసారి దసరా సందర్భంగా ఆ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దత్తన జరిపిన ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి ప్రాంతాలకతీతంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు , సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి మధ్య మాటల యుద్ధం సాగింది. ఆసక్తి రేపేలే ఉంది సభాముఖంగా వారిరువురి మధ్య జరిగిన ప్రసంగ పాటవం.
అస్సలీ మధ్య హనుమంతన్నకు ఏమైందో ఏమోగానీ రాయలసీమ ఆంధ్రా వాళ్ళంటే నరనరాన రగిలిపోతున్నట్టు ఆయన మాటలనూ, చేతలనూ గమనిస్తే అట్టే తెలిసిపోతుంది. మొన్నీ మధ్య పోసానితో గొడవ పడ్డడు. లైవ్ లో బూతులు మాట్లాడుకున్నారు. కాగా ఇప్పుడు అలయ్ బలయ్ కార్యక్రమంలో వీహెచ్ మాట్లాడుతూ... ప్రత్యేకంగా ఆంధ్రా రాయలసీమ ప్రాంతాల్లో ఇటువంటి అలయ్ బలయ్ జరుపుకొనే ఆచారం లేదని, అందుకనే అక్కడి ప్రాంతీయులంతా కత్తులు కటారులతో రగిలిపోతుంటారని మాట తూలాడు. అలాంటి చోట్ల కూడా ఇలాంటి అలయ్ బలయ్ కార్యక్రమం లాంటివి జరపాలని సభాముఖంగా దత్తాత్రేయకు, వెంకయ్య నాయుడికి తెలుపుతున్నానని తమ అభిప్రాయాన్ని వీహెచ్ వెల్లడించాడు. ఇక తర్వాత మాట్లాడిన నారాయణమూర్తి తనదైనశైలిలో వీహెచ్ మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఆంధ్రాపౌరుషంతో అదిరిపోయేలా అద్భుతంగా మాట్లాడి అందరినీ నోరు మూయించాడు నారాయణ మూర్తి. రాయలసీమవాసుల మంచితనం, వారి హృదయాన్ని, వారి ఆదరణను, కలుపుగోలుతనాన్ని ఆవిష్కరించాడు నారాయణ మూర్తి. అస్సలు అలయ్ బలయ్ ప్రోగ్రామ్ అంతా ఓ ఎత్తు అయితే వీరిద్దరి మాటల దాడి అందరిలోనూ ఆసక్తిని రేపాయి.
అయితే వీహెచ్ మొట్ట మొదట అలయ్ బలయ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ... అప్పట్లో మేము అలై బలై అంటుంటే అదేంటి కొత్తగా అలయ్ బలయ్ అన్నరు ఆంద్రోళ్ళు. ఎటకారంగా.. ఈ అలయ్ బలయ్ ఏందిరా బయ్ అన్నరు. అప్పుడు నేనన్నను... ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడం అన్నా. ఈ ఆచారం ఆంధ్రాలో ఉందో లేదో తెలియదు కానీ వెంకయ్య నాయుడు, సుజనా చౌదరీలకు చెబుతున్నా. ఎందుకంటే మా దగ్గిర ఎంత కొట్టుకున్నా, ఎంత తన్నుకున్నా దసరా వచ్చిందంటే చాలు అందరం కలిసిపోతం. కాబట్టి దత్తన్నా.. ఈ సారి రాయలసీమలో కూడా ఈ అలయ్ బలయ్ పెట్టు. అక్కడ ఒకరినొకరు కత్తులతో తిరుగుతుంటరు. ఈ అలయ్ బలయ్ ద్వారా అన్నా వాళ్లు కౌగిలించుకుంటారు. ప్రేమగా ఉంటరు. ఇంకా వీహెచ్ మాట్లాడుతూ.. ఇక్కడ ఎంత శతృత్వం ఉన్నా చావుకి పిలిస్తే పోతరు, పెళ్లికి పిలిస్తే పోతరు, కానీ అక్కడ రాయలసీమలో ఆ ఆనవాయితీ లేనట్టే చెప్పుకోవాలి అంటూ వీహెచ్ ప్రాంతీయతా ఫీలింగ్ తో రెచ్చిపోయాడు.
ఈ వీహెచ్ మాటతీరుకు అక్కడే ఉన్న నారాయణ మూర్తికి మండింది. తాను ఆంధ్రా వాడినే అంటూ తనదైన శైలిలో వీహెచ్ కి చురకలు అంటించాడు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ .... విభిన్న కుల మతాలతో ఉన్న దేశం మన భారతదేశం . భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుంటూ పయనిస్తున్న దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో హైదరాబాద్ లో అలయ్ బలయ్ జరపడం ఎంతో అవసరముంది. ఎందుకంటే ఇది మినీ భారత్ అంటూ మొదలెట్టిన నారాయణ మూర్తి వెంటనే రాయలసీమ టాపిక్ కి వచ్చేశాడు. వీహెచ్ హైదరాబాద్ లోనే కాదు రాయలసీమలో కూడా అలయ్ బలయ్ పెట్టమంటున్నాడు. వీహెచ్ తెలుసుకొని మాట్లాడాలంటూ రాయలసీమలో కక్షలూ కార్పణ్యాలే కాదు అంతకు మించిన ఆదరాభిమానాలు ఉన్నాయి అంటూ తమదైన శైలిలో స్పాట్ కౌంటర్ ఇచ్చాడు నారాయణ మూర్తి. ఇంకా నారాయణ మూర్తి మాట్లాడుతూ... కక్షలూ కార్పణ్యాలు ఎక్కడ లేవు? ఆంధ్రలో లేవా తెలంగాణలో లేవా యూపీలో లేవా అని ప్రశ్నిస్తూ రగిలిపోయేలా హెచ్చరించాడు. చివరిగా దత్తాత్రేయ గారూ మీరు జరిపే స్వచ్చ భారత్ లా దేశవ్యాప్తంగా ఈ అలయ్ బలయ్ ని కూడా జరిపించండి అని కోరి కూల్ అయ్యాడు.