తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు ఒక కొలిక్కి వచ్చింది. ఇక జిల్లాల పేర్లు కూడా తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టేసింది. రేపు విజయ దశమి సందర్భంగా ఆయా జిల్లాల పేర్లను అధికారికం గా ప్రకటించడమే మిగిలింది. కేసీఆర్ నిన్న భద్రకాళి అమ్మవారికి స్వర్ణాభరణాలను సమ్పర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కొత్తజిల్లాలు ఏర్పాటు ప్రజాభీష్టం మేరకే జరిగిందని, దీనిని కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని వారు చేస్తున్న వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వాళ్లని ఆయన తనదైన శైలిలో, నోటి మాటలతో చీల్చి చెండాడారు. తెలంగాణా రావడం ప్రజల దురదృష్టమైతే, ఈ కొత్త జిల్లా ఏర్పాటు మరీ దురదృష్టమని అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా అభివృద్ధిని చేసిన ముఖాలా... అసలు అభివృద్ధిని కూడా సరిగ్గా చూసి ఉండరు వాళ్ళు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం జేశారన్నారు.
అసలు ఎక్కువ జిల్లాలు ఉండటం వలన కలిగే ప్రయోజనాల్ని అర్థం చేసుకోకుండా, అభివృద్ధికి అడ్డుపడడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణలో పుష్కలం గా వర్షాలు పడి రాష్ట్రం సస్యశ్యామలం అవడానికి కారణమయ్యాయని అన్నారు. ఇక రైతులు కూడా కొత్త పంటలు వేసుకుని హ్యాపీగా వ్యవసాయం చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా ప్రతిపక్షాలకు ఏ సమస్యపై పోరాడాలో కూడా అర్ధంగాక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల్లో జనాభా తక్కువ ఉండటం వలన పాలనా సౌలభ్యం ఎక్కువ గా ఉంటుందని, ప్రతి ప్రభుత్వ పథకం అందరికీ అందేలా చూడొచ్చు. పైరవీకారులు, దోపిడీ దారుల నుండి ప్రజా ధనాన్ని కాపాడొచ్చు. ఇది అర్థం చేసుకుని ఎవరైనా మాట్లాడాలి అంటూ అందరికి వరుసగా చురకలంటించారు.
మరి కేసీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఏ విధంగా ఎదుర్కొని కొత్త జిల్లాల ఏర్పాటుకు సహకరిస్తాయో... లేక మళ్ళి నిరసనలు, ఆందోనలు చేపట్టి గందర గోళం సృష్టిస్తారో చూడాలి.
Advertisement
CJ Advs