ప్రతి సినిమాను అల్లు అర్జున్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎంతో కష్టపడుతుంటాడు. బన్నీ హీరోగా చేసే ప్రతి సినిమాలోనూ విభిన్నంగా దర్శనమిస్తూ సరికొత్త స్టైల్ ను కనబరుస్తుంటాడు. అందుకోసం భారీ కసరత్తులు చేస్తుంటాడు. కండలు పెంచి చేసిన సరైనోడు ద్వారా మంచి హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ దువ్వాడ జగన్నాధం అని కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఇందులో బన్నీ పాత్ర రెండు షేడ్స్ లలో ఉంటుందంటున్నారు. ఒక పాత్రలో బ్రాహ్మణుడి వేషంలో వంటవాడిలా కనపడనున్నాడు. ఈ పాత్రను అద్భుతంగా పండించడం కోసమని బన్నీ బ్రాహ్మణ రూపురేఖల కోసం, బ్రాహ్మణుల యాసభాషకోసం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.
అల్లు అర్జున్ తన బ్రాహ్మణ పాత్రను పండించుకోవడం కోసం ఇద్దరు బ్రాహ్మణులను పిలుపించుకొని మరీ సాధన మొదలు పెట్టాడని టాక్. ఒక్కొక్కడికి లక్ష రూపాయల వరకు పారితోషకం ఇచ్చి డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలన్న దానిపై సాధన చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. గతంలో రుద్రమదేవి సినిమాలోని గోనగన్నారెడ్డి పాత్ర కోసం కూడా బన్నీ ఇలానే సాధన చేశాడు. తెలంగాణ భాష, మాండలికంలో పట్టు సాధించడం కోసం గట్టి కృషి చేశాడు. ఇప్పుడు కూడా పాత్రను పండించడం కోసం బన్నీ రేయింబవళ్ళు బ్రాహ్మణ పదజాలంపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Advertisement
CJ Advs