ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ ఇప్పుడు సందీప్ కిషన్‌తో సినిమా చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ 'రైతు' అనే సినిమా చేయనున్నాడన్న విషయం కూడా తెలిసిందే. అది నందమూరి బాలకృష్ణ నటించే 101 వ చిత్రం. అయితే ఇప్పుడు సందీప్ కిషన్ చిత్రం తర్వాత కృష్ణవంశీ, కన్నప్ప అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడన్న వార్త.. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. కృష్ణవంశీ మనస్సులో మాత్రం 'రైతు' సినిమా పూర్తయిన తర్వాతే 'కన్నప్ప' సెట్స్‌పైకి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నాడు. కానీ సందీప్ కిషన్ సినిమాకీ, రైతు సినిమాకీ మధ్య వచ్చే గ్యాప్ లో కన్నప్ప చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
కన్నప్ప పేరుతో చిత్రం తీయాలని స్క్రిప్టును రెడీ చేసుకొని పెట్టుకున్నాడు తనికెళ్ళ భరణి. పాత్రకు తగిన హీరో కోసం భరణి రెండుళ్లుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కమిడియన్ కం హీరో సునీల్ చేయనున్నాడని అప్పట్లో అనుకున్నారు కూడాను. తరవాత అది విష్ణు వద్దకు వెళ్లింది. భరణి దర్శకత్వంలో విష్ణు హీరోగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని అందరూ భావించారు. రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నామని విష్ణు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాంటి ప్రకటనలు కూడా బయటకు వెలువడటం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ, కన్నప్ప సినిమా దర్శకత్వం నుండి భరణి తప్పుకొన్నట్లు తాజాగా తెలుస్తుంది. ఇప్పుడు కన్నప్ప సినిమాను క్రియేటీవ్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిశ్రమ వర్గాలు అనుకుంటున్న సమాచారం ప్రకారం.. కన్నప్ప స్క్రిప్ట్ మీద కృష్ణవంశీ మనస్సు పారేసుకొని మరీ ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. హీరో విష్ణు కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో కన్నప్ప సినిమాలో నటించడానికి ఉత్సాహం కనబరుస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కాగా వీరి కాంబినేషన్ లో ఈ సినిమా దాదాపు సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమైనట్లు కూడా టాక్. అయితే చివరి ట్విస్టేమిటంటే... ఈ సినిమాకు తనికెళ్ళ భరణి కేవలం రచయిత పాత్రను మాత్రమే పోషించడం.