భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో వాతావరణం వాడి వేడిగా ఉంది. ఇరుదేశాల సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణంలో ఉన్న ఆ ప్రాంతమంతా హై అలర్ట్ లో కొనసాగుతుంది. బుధవారం అర్ధరాత్రి భారత్ సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన ఘటన తెలుసుకున్న పాకిస్తాన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. పాకిస్తాన్ ఒత్తిడికి గురైనా చాలా సమర్ధవంతంగా పైకి మాత్రం ఆ దాడిలో భారత్ బలగాలనే తమ సైన్యం మట్టుపెట్టిందని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. దెబ్బతిన్నాగానీ మేకుపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ ను చూసి ప్రపంచ దేశాలు సైతం పాక్ కు ప్రతిఘటనతో కూడిన హెచ్చరికలు చేస్తున్నాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ సర్జికల్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లోని కొన్ని కీలక ప్రాంతాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరంతరం అలర్టుగా ఉండాలంటూ స్వయంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పోన్ లో మాట్లాడి చెప్పినట్లు సమాచారం. కాగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు కూడా హోం మంత్రి నుంచి సమాచారం అందినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని రక్షణ సంస్థలను, విశాఖపట్టణంలో నేవీ సంస్థలను, గుంటూరు జిల్లా బాపట్లలోని ఎయిర్ ఫోర్స్ బేస్ ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇస్రోలో కూడా భద్రతను కట్టుదిట్టం చేయాల్సింది కోరినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా భద్రతకు సంబంధించి మెట్రో నగరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని అదుపులోకి తీసుకోవాలని తెలిపినట్లు సమాచారం. ఇంకా అన్ని రాష్ట్రాల్లోని పోలీసులు, కమీషనర్లు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరినట్లు తెలుస్తుంది.