భాజపా ప్రభుత్వాన్ని బాజపా నాయకులను నిరంతరం అడ్డుపడుతూ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా మనస్సు మార్చుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకు తొలి అడుగు అన్నట్లుగా గత రాత్రి భారత సైన్యం పాక్ లోనికి 3కిలో మీటర్లు చొప్పున చొచ్చుకుపోయి దాదాపు ఎనిమిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 38మంది వరకు ఉగ్రవాదులను తుదముట్టించింది. దీంతో పాక్ కు ఓ రకంగా దిమ్మ తిరిగినట్లుగానే అయింది.
కాగా భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరుపుతున్న దాడుల బాధ్యత పూర్తిగా పాకిస్తాన్ దేనని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించింది. ఆమె ఉగ్రవాదుల విషయంపై జరిగిన అఖిల పక్ష సమావేశానికి హాజరై మీడియాతో మాట్లాడింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న పోరాటానికి సంబంధించి తమ పూర్తి మద్దతును తెలిపింది. ఉగ్రవాదాన్ని పోషించడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా వ్యవహరించడం, అందుకు పాక్ లో ఉగ్రవాదులకు తగిన వసతి కల్పించడం వంటి వాటికి ఇకనైనా పాక్ చరమగీతం పాడాలని ఆమె ఆకాంక్షించింది. కాగా తాజాగా భారత్ జరిపిన ప్రతి దాడి విషయంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని కేంద్రం హోంశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా వెంటనే దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బారత సైన్యం చేసిన సాహసానికి సమావేశం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించిన తీరు, తీసుకున్న చర్యలు, జరుగుతున్న పరిణామాలపై హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ వివరణ ఇచ్చాడు. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతి స్పందనకు అన్ని పార్టీలనుండి సంపూర్ణ మద్దతు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఫుల్ జోష్ మీద ఉంది.