ఈ మధ్యన ఒక సినిమా తమ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయితే ఆ హీరో గారి సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఆ సినిమాని తెరకెక్కించిన దర్శకుడికి ఏదో ఒక భారీ గిఫ్ట్ ఇచ్చి తమ కృతజ్ఞతని చాటుకుంటున్నాడు. అలా బహుమతులు ఇవ్వడం ఎప్పటినుండో వుంది కానీ ఈ మధ్యన అది కాస్తా మీడియా పుణ్యమా అని తెగ హైలెట్ అయ్యింది. అలా బహుమతులు డైరెక్టర్ కి ఇచ్చిన స్టార్స్ లో మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ కి చాలా ప్లాపుల తర్వాత 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివకి 'ఆడి' కారుని గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో కెక్కాడు. ఇక తాజాగా ఆ లిస్ట్ లోకి ఎన్టీఆర్ వచ్చి చేరాడు. 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్టిచ్చిన కొరటాలకు ఎన్టీఆర్ 'డూప్లెక్స్ ఇల్లు'ను గిఫ్ట్ గా ఇచ్చి శెభాష్ అనిపించుకున్నాడు. మరి కొరటాల వెంటవెంటనే రెండు బహుమతులందుకుని ఔరా అనిపించాడు. ఇంకా ఈ లిస్ట్ లో మారుతి, సుకుమార్ లు కూడా వున్నారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన 'బాహుబలి' సినిమాని రాజమౌళి తెరకెక్కించాడు. 'బాహుబలి 1' తో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చూపించిన రాజమౌళి 'బాహుబలి 2' తో మరిన్ని సంచలనాలకు నెలవు కానున్నాడు. మరి 'బాహుబలి'కి ముందు ప్రభాస్ అంటే ఒక్క తెలుగులో నే అందరికి తెలుసు... మహా అయితే అటు తమిళం లో కూడా కొంతమందికి తెలుసు. కానీ మిగతా వాళ్లలో కొంతమందికే ప్రభాస్ అంటే తెలుసు. కానీ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఒక్క 'బాహుబలి' తో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. అంటే 'బాహుబలి'లో నటించిన హీరోగా ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళికి ప్రభాస్ ఏమిచ్చి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఒక పక్క తమ కెరీర్ కి బెస్ట్ సినిమా అందిచ్చిన డైరెక్షర్స్ కి తెలుగు హీరోలు ఏవో కానుకులు ఇచ్చేస్తూ హడావుడి చేసేస్తుంటే ప్రభాస్ ఎందుకు సైలెంట్ గా వున్నాడు.
అంటే 'బాహుబలి 2' రిలీజ్ అయ్యాక ఏదో ఒక బహుమతి రాజమౌళి కి ఇద్దామనుకుంటున్నాడేమో. కేవలం తెలుగులో సూపర్ హిట్ సినిమాలు తీసినందుకే ఆ డైరెకర్స్ ఖరీదైన కార్లు, ఖరీదైన బంగళాలు అందుకుంటుంటే... ప్రపంచ వ్యాప్తం గా ప్రభాస్ పేరు మార్మోగేలా చేసిన రాజమౌళికి ప్రభాస్ ఎలాంటి బహుమతి ఇవ్వాలి మరి . ఎలాంటి బహుమతి అయితే బావుంటుందో మీరే ఆలోచించండి. కార్లు, బంగళాల కంటే ఖరీదైన బహుమతులు ఇంకేమి ఉంటాయి. మీ ఊహకి కూడా అందడం లేదా? సరే అలాగైతే ఆ అవకాశాన్ని ప్రభాస్ కే ఇచ్చేద్దాం. చూద్దాం ప్రభాస్ ఎలాంటి బహుమతిని రాజమౌళి కి ఇవ్వబోతున్నాడో..!