పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చంద్రబాబు దర్శకత్వంలో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో గొప్ప సినిమా ప్రదర్శితమైంది. అదే ప్రత్యేకహోదా అనే చిత్రం. భాజపా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించిన సాంకేతిక నిపుణులు బొమ్మకట్టి చూయించారు. ఈ చిత్రంలో అంతర్లీనంగా సినిమా ఆసాంతం నడిచిన ఎలిమెంట్ మాత్రం ప్రత్యేక ప్యాకేజిని వెల్లడించడం అనే విషయం. ఈ అంశాన్ని వెల్లడించడానికి భాజపా నిర్మాణంలో తెరకెక్కిన ఈ అద్భుత చిత్రరాజానికి ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు.
బాజపా నిర్మాణ సారధ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చంద్రబాబు దర్శకత్వం వహించిన 'ప్రత్యేక హోదా' చిత్రాన్ని 'ప్రత్యేక ప్యాకేజీ' గా మార్చి విడుదల చేయడానికి చాలా రసవత్తరమైన నాటకీయత ప్రధాన పాత్ర వహించింది. చిరంజీవి చిత్రం కత్తిలాండోడు- ఖైదీ నెం.150 అయినట్టు, కడప కింగ్- కాటమరాయుడు అయినట్టు ప్రత్యేక హోదా కాస్త ప్రత్యేక ప్యాకేజీగా మారి.. ఎట్టకేలకు ఆంధ్రాలో సినిమాను విడుదల చేశారు. ఆ చిత్రం విడుదల రోజు మిశ్రమ ఫలితాలను చవిచూసినా ఆ తర్వాత తర్వాత సినిమాలో ఆర్టిస్టుల నటనా విశ్వరూపంతో 'ప్రత్యేక ప్యాకేజీ' చిత్రం విజయం సాధించిందనే చెప్పాలి.
ప్రత్యేక ప్యాకేజీ అనే చిత్రాన్ని నిర్మాతలు, డైరెక్టుగా విడుదల చేస్తే పలు సమస్యలు, నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భావంతో రసవత్తరమైన నాటకాన్ని పండించారు. పటిష్టమైన, గట్టి పోటీని ఇచ్చే విలన్లను నియమించుకున్నారు. దర్శకుడికి ముందుగానే సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఉండాలి కూడాను. హీరోకు తప్పకుండా తెలియాలి. లేకపోతే నచ్చని కథను, లెక్క తక్కువగా బేరసారాలకు దిగే కథలను హీరో అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే హీరో ఎప్పుడూ తన హోదాను తగినట్లుగా డిమాండ్ చేస్తుంటాడు. పక్కా లెక్కతో వ్యవహరిస్తుంటాడు. ఇంకా జనం మెచ్చే విధంగా కొనసాగుతుంటాడు. ఇప్పుడు పవన్ హీరోగా విడుదలైన ఈ చిత్రంలో ప్యాకేజీ కథనంతో ముందుకు పోవాలంటే విలన్ లను పటిష్టంగా ఎదుర్కొని వారిని అధిగమించి ముందుకు దూసుకుపోవాలి. మొదట కథనం సాపీగా సాగాలంటే ఎలాంటి నష్టాన్ని చవి చూడకూడదు. అందుకు తగిన ఏర్పాట్లను పకడ్భంధీగా నిర్మించుకోవాలి. హోదా బదులు, ప్యాకేజీ అని పేరు మార్చి సినిమా విడుదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకూడదు. ఇది దర్శకత్వ నిపుణత. ఇదంతా కథనంలో భాగంగా దర్శకుడి హీరో చేత తగిన విధంగా నటనను పిండుకోవాలి. అది చాలా చక్కగా చేయించుకొని దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం భాజపా సారధ్యంలో అద్భుతంగా విడుదలై సక్సెస్ సాధించే దిశగా నడుస్తుంది. కానీ ఇక్కడ మొదట హీరోనే విలన్ అవతారం ఎత్తి, విలన్ లను దడ పుట్టించాడు. జగన్, శివాజీ వంటి వారిలో దూరాడు. ఆ తర్వాత తను సాధించాల్సింది నైతికంగా హీరోయిజంతోనే సాధించుకున్నాడు. అసలు ఈ పవన్ హీరోనా విలనా అనే ఆలోచనను భ్రాంతిని విలన్లకే కలిగించాడు. చివరకు ప్యాకేజీ ముట్టింది. హీరో ఎక్కడ వున్నాడో తెలియదు. సినిమా సుఖాంతంగా ముగిసింది. కానీ విలన్లు మాత్రం నిరంతరం హోదా కావాల్సిందే నంటూ పోరాడుతూనే ఉన్నారు. ఈసారి జగన్ మాత్రం తాను హీరోగా హోదా సాధిస్తానంటున్నాడు. విలన్ ఎప్పుడు హీరో కావాలి. తాను రాబోవు విలన్లందరినీ అధిగమించి ఎప్పుడు హోదాను సాధించాలి. చూద్దాం ప్రత్యేక ప్యాకేజీ సినిమా ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో...
అన్నట్టు ఈ సినిమాలో హీరో..మళ్లీ కనిపించాలంటే..దర్శకుడు ఏదో ఒక స్క్రిప్ట్ రెడీ చేయాలి. అప్పుడే మాత్రమే ప్రేక్షకులు గుర్తొస్తారు. అయన హీరోయిజం గుర్తొస్తుంది. మరి ఈ చిత్ర దర్శకుడు..మళ్లీ ఏం స్క్రిప్ట్ మీద హీరోని పిలిపిస్తాడో చూద్దాం.