కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాళ్ళ మీద సవాళ్ళు వదులుతున్నారు. నిన్నటికి మొన్న కాపు ఉద్యమానికి స్ఫూర్తి మీరేనంటూ చంద్రబాబుపై చెలరేగిపోయాడు ముద్రగడ. అంతేకాకుండా మావి దొంగ దీక్షలంటూ పలుకుతున్న మీరు అధికారంలో లేనప్పుడు మీరుచేసిన వాటిపై మేం ఏమనాలి అని చంద్రబాబుకు ముద్రగడ ప్రశ్నలమీద ప్రశ్నలను సంధించాడు.
తాజాగా ముద్రగడ మాట్లాడుతూ.. తాను బహిరంగ సభ జరిపిన ప్రదేశంలోనే మీరు మీ కులస్తులతో సభను ఏర్పాటు చేయండి. అక్కడే ఆ సభను జరిపి, విజయవంతం గాని చేస్తే తాను ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్తానని బాబుకు సవాల్ విసిరాడు ముద్రగడ. ఇంకా ముద్రగడ స్పందిస్తూ.. తాను తుని సభలో కనీసం మంచినీరు కూడా సప్లై చేయలేదని, అంతా మా కులస్తుల రక్తంతో... కష్టార్జితంతో సరఫరా చేశారని అన్నీ మా కులస్తుల ఉద్యమంలో నుండే వచ్చాయనీ అన్నారు. తాగిన నీరు, తిన్న తిండి కోసం సర్వం మా కులస్తులు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చేసినవేనని ముద్రగడ వెల్లడించాడు. అలాంటిది మా ఉద్యమంపై తప్పుడు ప్రచారాలను, అణచివేతను ఆపాలని ఆయన కోరాడు. ఇంకా అలాంటి తుని వంటి సభను జరిపి దాన్ని విజయవంతం చేసినట్లయితే తాను ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్తానని, ఆ తర్వాత మా ఆస్తులన్నింటినీ మీరే అనుభవించుకొనేలా వీలునామా కూడా రాసిపెడతానని ఆయన బాబుకు సవాల్ విసిరాడు. ఇంకా మా ఉద్యమానికి నీతి, న్యాయం, బాధ, ఆక్రోశం వంటివి ప్రధాన భూమికలుగా నిలుస్తున్నాయని ముద్రగడ అన్నాడు.