నీటి కోసం యుద్ధాలు జరుగుతున్న, జరుపుకుంటున్న కాలంలో బారతీయులున్నారు. ముఖ్యంగా దక్షణ బారతదేశంలోనే కావేరి, కృష్ణా జలాల పంపిణీ విషయాల్లో అల్లర్లు, గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఎగువ నుంచి దిగువకు నీటిని వదలక పోవడంతోనే చాలా సమస్యలు వస్తున్నాయి. అదే విధంగా ప్రాజెక్టుల విషయంలో కూడా అనేకమైన సమస్యలను చవిచూశాం. అయితే తాజా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కావేరి జల వివాదం కారణంగా ఇరు రాష్ట్రాలకు కొన్ని కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. సుప్రీం ఆదేశాలను కూడా కన్నడ ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఈ జలవివాదాంశం ఆకర్షించింది.
కాగా మొన్నటి వరకు తమకే నీరు లేదని అలాంటప్పుడు తాము మిగతా రాష్ట్రానికి ఎలా ఇవ్వగలమని పలికిన కర్ణాటక ప్రభుత్వం తాజాగా మాటమారుస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో తాము తమిళనాడుకు నీరు విడవలేమని, కాకపోతే బాకీ కింద రాసుకుంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం తమకు పుష్కలంగా ఉన్నప్పుడు ఆ నీటి బాకీ చెల్లిస్తామని కొత్తరాగాన్ని అందిపుచ్చుకొని మరీ అతి తెలివి ప్రదర్శిస్తుంది కర్ణాటక. అయితే కర్ణాటక ఎత్తుగడలో ఉన్న రహస్యం ఏంటంటే ఇది వర్షాకాలమే కాబట్టి ఇప్పుడు కాకుండా డిసెంబర్ లోపు బాగా వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు కావేరికి వరద జలాలు వచ్చిన సమయంలో ఆ నీరు విడిచిపెడతామని చెప్తూ భల్లే పలుకుతుంది ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం. అలాంటి సమయంలో మాత్రమే సుప్రీంకోర్టు చెప్పినట్లుగా రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున ఏడురోజులు నీరు వదలగలమని కొత్తరాగాన్ని పాడుతుంది కర్ణాటక. దీనికి తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అందుకు సుప్రీంకోర్టు రియాక్షన్ ఏంటో కూడా తెలుసుకోవాల్సి ఉంది.