జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిపిన భారీ బహిరంగ సభలో ప్రతేక హోదా కోసం తాను దశల వారీగా, ఇంకా ప్రాంతాల వారీగా ఉద్యమిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దశల వారీగా పోరాటం చేస్తాననీ, ఇక చివరిదశలో ఎంపీలతో రాజీనామా చేసేంతవరకు పట్టుబడతామని పవన్ ఆ సందర్భంగా తెలిపాడు. కాకినాడలో జరిపిన సభలో భాజపాను విమర్శించేందుకు పవన్ కంకణం కట్టుకున్నాడు. అందుకు ప్రతిస్పందనగా భాజపా అధిష్టానం నుండి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇంతలా సభా వేదికల సాక్షిగా మాటలిచ్చి ఆ తర్వాత పవన్ తన తర్వాతి పోరాటాన్ని గురించి ఇంకా ప్రకటించనే లేదు సరికదా ఇప్పుడు ఆ ఊసుకూడా ఎక్కడా వినిపించడం కానీ, కనిపించడం కానీ లేదు. ఎంతైనా తిరుపతిలో చేసినంత వేడి ప్రసంగం కాకినాడలో లేదని పవన్ మీద అప్పట్లో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాడు. గత కొంతకాలంగా జగన్ ప్రత్యేక హోదా కోసం నిరంతరం దీక్షలు, యువభేరీలు అంటూ ప్రజల పక్షాన నిలబడి గర్జిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు విశేషమేంటంటే జనసేన అధినేత పవన్ తిరుపతి సభలో ప్రకటించినట్లుగానే తానూ దశలవారీగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తానని ప్రకటించాడు జగన్.
ప్రత్యేక హోదా కోసం పవన్ లా తాను దశల వారీగా పోరాటం జరుపుతానని, అందులో భాగంగా అవసరం అనుకుంటే చివరదశలో తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తానని జగన్ సంచలనాత్మక ప్రకటన చేశాడు. ఇంకా జగన్ మాట్లాడుతూ... తమ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్చుకున్న 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలచే చంద్రబాబు రాజీనామా చేయించాలని కోరాడు. నిజంగా చంద్రబాబుకు దమ్ముంటే ఉపఎన్నికలకు రావాలని సవాల్ విసిరాడు జగన్.