ఇటీవలే బిజెపిలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలతో పాటు బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు వంటి నాయకుల స్వరం మారుతోందా? అంటే అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. రాష్ట్రంలో బిజెపికి మిత్రపక్షమైన టిడిపిని, దాని అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ నాయకులు గతంలో తీవ్రవిమర్శలు చేసేవారు. కానీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర బిజెపి నేతలను పిలిచి, చంద్రబాబునాయుడు మన మిత్రుడు.ఆయనతో పొత్తు కొనసాగుతుంది. బిజెపితో టిడిపి కట్ అయితే ఆ స్ధానంలో వైసీపీ ఎన్డీఏ కూటమిలో చేరాలని భావిస్తోంది.కానీ మనం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నాం.వైసీపీతో జత కట్టే యోచన బిజెపికి లేదు. కాబట్టి చంద్రబాబుతో దోస్తీ చేయండి.. ఆయనను విమర్శించవద్దని అమిత్‌షా రాష్ట్ర బిజెపి నాయకులకు హితభోధ చేశారని, అప్పటి నుంచి చంద్రబాబు విషయంలో బిజెపి నేతల స్వరం మారుతోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.