సీనియర్‌స్టార్ విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ 'గురు'గా నటిస్తున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. హిందీ, తమిళ భాషల్లో మాధవన్, రితికాసింగ్‌లు నటించిన 'సాలా ఖుద్దూస్'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఇటీవలే తెలుగు రీమేక్ మొదలైన ఈ చిత్రాన్ని ఎలాగైనా డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మరి వెంకీ లాంటి సీనియర్ స్టార్ చిత్రాన్ని అంత తక్కువ వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారు? ఎంత రీమేక్ అయినా ఇంత తక్కువ కాలంలో ఎలా తీస్తారు? అనే ప్రశ్న అందరినీ వేధించింది. కాగా ఈచిత్రంలో వెంకటేష్ తప్ప మిగిలిన నటీనటులందరూ ఒరిజినల్ వెర్షన్‌లో చేసే వారే ఉంటారని ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది. కాగా ఈ చిత్రానికి తెలుగులో కూడా సుధాకొంగరే దర్శకత్వం వహించనుంది. ఈ చిత్రానికి చెందిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో మాధవన్ నటించే సన్నివేశాలు, మాధవన్, ఆయన శిష్యురాలు రితికాసింగ్‌లు కలిసి నటించే సీన్స్‌ను మాత్రమే ఈ చిత్రం కోసం వెంకీపై చిత్రీకరణ జరుగుతుందని, కేవలం ఈ సీన్స్‌ను మాత్రమే వెంకీతో రీమేక్ చేసి మిగిలిన క్యారెక్టర్లు మధ్య వచ్చే సీన్లను డబ్బింగ్ చేయనున్నారని సమాచారం. అంటే ఈ చిత్రం కొంత రీమేక్, మరికొంత డబ్బింగ్ అని తెలుస్తోంది. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే ఈ చిత్రం మన నేటివిటీకి తగ్గట్లుగా మార్చడం కానీ, మరలా తీయడం కాని ఉండదు. అలా ప్లాన్ చేయబట్టే ఈ చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.