తుని కాపుగర్జనలో జరిగిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అనిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడ ఒత్తిళ్లకు లోనై తుని ఘటన లో బాధ్యులైన వారికి బెయిల్ ఇచ్చింది. అప్పుడు బెయిల్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సిఐడి అరెస్ట్ లు, విచారణలు అంటూ మళ్ళీ కాపు నేతలకు చమట్లు పట్టించే పనిలో పడింది. పాపం ముద్రగడ ఓవర్ యాక్షన్ చేసి ఏదో నిరాహార దీక్ష చేసేసి.... ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేసి.... ఏపీ ప్రభుత్వాన్ని మూడుచెరువుల నీళ్లు తాగించాను అని అనుకుని వారికి బెయిల్ అయితే తీసుకురాగలిగాడు కానీ... ఇప్పుడు విచారణలు ఆపడానికి ప్రస్తుతానికి ఏమి చెయ్యకుండా కామ్ గా వున్నాడు. ఇప్పుడు విచారణని అడ్డుకోవడానికి మళ్ళీ ఇంకేం ఎత్తులు వేస్తాడో చూడాలి. ఇలాంటి వాటిని తిప్పికొట్టడానికి ఆ మధ్య కాపు నేతలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్య చరణను కూడా రచించేసాడు.
ఇక ఇప్పుడు కాపు నేతలను ప్రశ్నించే పనిలో సిఐడి ఉండగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తుని కాపు గర్జనకు హైదరాబాద్ నుండే సహాయ సహకారాలు అందినట్టు కొంతమంది విచారణలో చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని కూడా ఒక ఛానెల్ ఎండి తన విచారణలో చెప్పినట్లు అంటున్నారు. రాజమండ్రి లో ఆ ఛానల్ ఎండి ని విచారించగా కాపు ఘర్జనకి ముందు ముద్రగడ తనను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడని... ఆ కాపు గర్జన లో వాడిన డ్రోన్ కెమెరాలను ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేసినట్లు విచారణలో చెప్పాడని అంటున్నారు. మరి ఈ లెక్కన ముద్రగడ అంత హై డ్రామా నడిపించి ఏపీ ప్రభుత్వాన్ని ఎలాగోలా మభ్యపెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఈసారి డైరెక్ట్ గా ఇరుక్కుంటాడని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
ఇప్పటికే కాపు గర్జనకు సహాయం అందించాడని వైసిపి నేత కరుణాకరరెడ్డిని రెండు సార్లు విచారించి వదిలేశారు. మళ్ళీ ఈ రోజూ కరుణాకరరెడ్డిని గుంటూరులోని సిబిఐ కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. అయితే కరుణాకరరెడ్డి మాత్రం భారీగా కార్యకర్తలు, మంది మార్బలం తో విచారణకు హాజరైయ్యారు. ఇక ఈ విచారణ పూర్తయ్యాక కరుణాకరరెడ్డిని అరెస్ట్ చేస్తారని వదంతులు పుట్టుకొచ్చాయి. మరి కరుణాకరరెడ్డిని గనక అరెస్ట్ చేస్తే ఈ సారి కాపు నేతలకు తోడుగా ఉంటామని వైసిపి నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. అంటే ఈసారి కరుణాకరరెడ్డి ఎలాగైనా అరెస్ట్ అవుతాడని వీరికి తెలిసిపోయినట్టుంది. అందుకే ముందు జాగ్రత్తగా వీరు ఏదో ఒకటి ప్లాన్ చెయ్యడానికి రెడీ అయ్యారన్నమాట. అందుకే కాపులకు వైసిపి అండగా ఉంటుందని భజన మొదలెట్టారు.
మొత్తానికి తుని ఘటన కాపు నేతలకు నిద్ర లేకుండా చేస్తుందనేది వాస్తవం. ఈ కేసు నుండి ఎలా తెప్పించుకోవాలా అని నేతలందరూ తెగ ఆలోచించేస్తున్నారట. ఇంకా చాలామందిని సిబిఐ ప్రశ్నించడానికి రెడీ అయ్యిందట.