స్వర్గం-నరకం అనేవి వ్యతిరేక పదాలు. సినీ పరిశ్రమలో కూడా కొందరు ఆర్టిస్టులకు స్వర్గం, నరకం ఉంటుంది. 41 సంవత్సరాల క్రితం దాసరి నారాయణరావు అంతా కొత్తవారితో 'స్వర్గం-నరకం' చిత్రం తీశారు. ఈ సినిమా 1975 నవంబర్ 22న విడుదలైంది. ఇందులో నటించిన ఆర్టిస్టులకు సైతం సినీరంగంలో స్వర్గం, నరకం ఎదురైంది.
ఇదే సినిమా ద్వారా పరిచయమైన మోహన్‌బాబు నాలుగు పదుల కెరీర్, 512 చిత్రాల్లో నటించిన ఘనత దక్కింది. ఆయన నిర్మాతగా యాభై చిత్రాలు తీశారు. వారసులుగా ముగ్గురు సంతానం రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో ఘన సత్కారం జరిగింది.
మోహన్‌బాబుతో పాటుగా పరిచయమైన మరో నటుడు ఈశ్వరరావు, అన్నపూర్ణ, ఫటాఫట్ జయలక్ష్మీ. వీరిలో జయలక్ష్మీ మృతి చెందగా అన్నపూర్ణ తల్లి పాత్రలకు, ఇప్పుడు బామ్మ పాత్రలకు పరిమితమయ్యారు. ఇక మరో నటుడు ఈశ్వరరావు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. ఆ తర్యాత క్యారెక్టర్ నటుడిగా మారాడు. చివరికి చిన్న చిన్న పాత్రలు సైతం లేకుండాపోయాయి. ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు.
సినీరంగంలో ఇలాంటి పరిణామాలు సహజమే. అయికే కాకతాళీయంగా సినిమా పేరు 'స్వర్గం-నరకం' కావడం వల్ల దానితో పోల్చడం జరిగింది.