విలక్షణ నటుడు మోహన్‌బాబు నాలుగు పదుల నటజీవితం సందర్భంగా వైజాగ్ వేదికగా ఘన సత్కారం జరుగుతోంది. అదే రోజు సన్మాన కర్త టి.సుబ్బరామిరెడ్డి బర్త్‌డే. అంటే స్వీయ సత్కారంతో పాటు అతిథి సత్కారం జరుగుతుందన్నమాట. ప్రతి ఏడాది తన బర్త్‌డేకు తారలతో హడావుడి చేయడం టిఎస్‌ఆర్ (టి.సుబ్బరామిరెడ్డి)కి కొత్త కాదు. వైజాగ్ వేదికగా ఆయన అనేక మంది సెలబ్రిటీలను సత్కరించారు. ఈ సారి కూడా ఆ కేటగిరిలోనే మోహన్‌బాబును సత్కరిస్తున్నారని భావించవచ్చు. నిజానికి తండ్రి 40 ఏళ్ళ ప్రస్థానాన్ని ఏడాది పొడవునా జరపడానికి మంచు సోదరులు ప్లాన్ చేసినా, అది కార్యరూపం దాల్చలేదు. సహజంగా ప్రయివేట్ సన్మానాలకు దూరంగా ఉండే మోహన్‌బాబు దీనికి అంగీకరించడం విశేషం. కేవలం టిఎస్‌ఆర్‌తో ఆయనకున్న సాన్నిహిత్యం వల్లే అనుకోవచ్చు.
ఇక అనేక మంది తారలు వైజాగ్ చేరుకున్నారు. వీరంతా భయంతో వచ్చారా అభిమానంతో వచ్చారా అనేది తేలాలి. ప్రతి ఏడాదిలాగే వచ్చారని టిఎస్‌ఆర్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నెలల ముందుగానే టిఎస్‌ఆర్ తన బర్త్ డే సందర్భంగా స్టార్స్ డేట్స్ కన్‌ఫర్మ్ చేసుకుంటారు. వారికి విమాన ప్రయాణపు టికెట్లు, బస, స్థానిక ఏర్పాట్లు చేస్తారు. ఒకప్పుడు దాసరి నారాయణరావును పక్కన పెట్టేసినా ఇప్పుడు ఆయనను కలుపుకున్నారు.