వైసిపి నుండి టిడిపిలోకి జంప్ అయిన జలీల్ ఖాన్.. వైసిపి అధ్యక్షుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ టిడిపిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకునే పని లో పడ్డాడు. అసలే ఇప్పుడు టిడిపిలో మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని అంటున్నారు. ఇటువంటి సమయం లో చంద్రబాబుని ఎంత కాకా పడితే అంతమంచిది. ఎవరికి వారు తమకు తోచినట్టు టిడిపికి, చంద్రబాబుకు విధేయులుగా మాట్లాడేస్తున్నారు. అయితే జలీల్ ఖాన్ మాత్రం నిన్న టిడిపిలో చేరిన దేవినేని నెహ్రూ, దేవినేని అఖిలేష్ లను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇక పనిలో పనిగా చంద్ర బాబు మెప్పుకోసం కూడా ప్రయత్నాలు మొదలెట్టేసాడు. నెహ్రూ టిడిపిలోకి రావడాన్ని స్వాగతిస్తూ... నేను గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి వెళ్ళేటప్పుడు గాని, ఏలూరు నుండి వెళ్ళేటప్పుడు గాని దేవినేని నెహ్రూ ఉంటున్న ఇంటివైపు చూసి ఇక్కడ కూడా టిడిపి జెండాలు... పసుపురంగు జెండాలు ఎగిరితే ఎంత బావుండునో అని అనుకునే వాడినని చెప్పుకొచ్చాడు. ఇక నెహ్రూ కూడా టిడిపిలోకి వచ్చేస్తే విజయవాడ మొత్తం టిడిపి చేతుల్లోకి వచ్చేస్తుందని చాలా సార్లు అనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక నెహ్రూ నిన్న టిడిపిలో చేరి టిడిపికి అండగా నిలబడ్డాడని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. అయితే జగన్ పార్టీ ఎమ్యెల్యేలు కొందరు నెహ్రూ దగ్గరికి రాయబారానికి వెళ్లారని... అయితే నేను దేవినేని నెహ్రూ కి ఒకే ఒక్క మాట చెప్పానని... రాష్ట్రానికి నాయకుడయ్యే లక్షణాలు జగన్ కి లేవని... ఒకవేళ అలాంటి అనుభవం లేని పిల్లకాకితో గనక చేరితే రాజకీయంగా నష్టపోతావని చెప్పానని జలీల్ ఖాన్ చెప్పాడట. ఇక నెహ్రూ టిడిపిలో చేరడం తో కృష్ణ జిల్లా వ్యాప్తం గా పండగ వాతావరణం నెలకొందని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా చంద్రబాబుని పొగడ్తలతో ముంచి లేపాడు. మరి చంద్రబాబు ఉబ్బిపోయి జలీల్ ఖాన్ కి మంత్రి పదవి ఇస్తాడో లేక మొండి చెయ్యి చూపిస్తాడో త్వరలోనే తేలిపోతుంది.