జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పూర్తిస్థాయి రాజకీయాలు చేయమని, కొమరం పులిలా రాజకీయాల్లోకి రమ్మని వైకాపా ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరింది. పవన్ ఇకనైనా పార్టీలకు తొత్తుగా వ్యవహరించకుండా స్వతంత్రంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పింది. కాగా పవన్ గత ఎన్నికల్లో తెదేపాకు మద్దతివ్వడంపై మండిపడింది. ఐదేళ్లకు ఒకసారి వచ్చే సాధారణ ఎన్నికల్లో హల్ చల్ చేసి వేరే పార్టీలకు మద్దతు తెలపడం, రెండేళ్లకు కలిపి రెండు మీటింగ్ లు పెట్టడం వంటివి మానుకొని పూర్తిగా ప్రజలకు అంకితమై రాజకీయాలు నడపాలని రోజా వెల్లడించింది. కాగా వైకాపా చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పోలీస్ ల ద్వారా అణచి వేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలో జరిపిన ప్రజా సంఘాల నాయకులతో కలసి సామూహిక నిరాహారా దీక్ష చేపట్టిన సందర్భంలో రోజా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎన్ టి రామారావు వలె సినిమాలకు స్వస్తి చెప్పి పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని రోజా తెలిపింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని సాక్షిగా తెదేపా, భాజపాలు, అందులో పవన్ కూడా దగ్గరుండి ప్రమాణం చేయడాన్ని ప్రత్యక్షంగా విన్నారని అందుకు తాను ప్రజల్లోకి వచ్చి హోదా కోసం ఉద్యమించాలని ఆమె కోరింది. కాగా అధికారమే పరమార్థంగా చంద్రబాబు రాష్ట్రంలో వ్యవహరిస్తున్నాడని, అతని శైలి నయీమ్ అరాచకాల కంటే దారుణంగా ఉందని రోజా మండిపడింది. ఇంకా రోజా మాట్లాడుతూ నిజంగా తాను ఎప్పుడూ నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికి 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడని ఆరోపించింది. చివరగా చంద్రబాబు, పవన్ లు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంకా బొమ్మలు చూపించి మరీ అమరావతిని భ్రమరావతిగా మార్చేస్తున్నారని ఆ ఘనత వారిద్దరికే దక్కుతుందని రోజా వెల్లడించింది.