Advertisement
Google Ads BL

కావేరి కార్చిచ్చుకు కారణం సినీ గ్లామరేనా?


కావేరి నదీ జలాల కోసం అటు తమిళనాట సినీ నటులు, ఇటు కన్నడ సినీ నటుల మధ్య పోరాటంతోనే ప్రజల్లో మొదట వేడి పుట్టిందని చెప్పాలి. అలా అలా చిలికి చిలికి గాలివానగా ప్రజలందరిలోకీ, కార్యకర్తలలోకి, పార్టీలకూ పాకింది. కావేరి జల వివాదం వంటి చాలా సున్నితమైన అంశాలపై తెరపైన కులికే బాధ్యత కలిగిన సినీ తారాలోకం ఏ విధంగా స్పందించాలో తెలియకుండా ప్రవర్తించిందనే చెప్పాలి. కావేరి జలాలపై తమిళనాడు రాష్ట్రానికి 15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసింది. కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై కర్ణాటకలో మొదట సినిమా వాళ్ళే నిరసన తెలిపారు. దానికి పోటీగా తమిళ సినీలోకం ఆందోళనలు చేపట్టవలసిన అవసరం ఉందా? అసలు అది ఏం విషయం? చట్టంతో ముడిపడిన విషయాన్ని రచ్చ చేయాలా? వద్దా? అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా సినిమా గ్లామర్ వ్యవహరిస్తుందంటే ఏమనుకోవాలి.  సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మొదట కన్నడ సినీ రంగం చాలా చురుకుగా ఆందోళన చేస్తే అందుకు ధీటుగా తమిళ సినీ రంగం ఆందోళనకు దిగటం ఎంతవరకు సమంజసం అన్నదే ఇక్కడ ప్రశ్న. అంతటితో ఆగకుండా శాండిల్ వుడ్ నటులు కొంతమంది జయలలితను కించపరిచేలా మాట్లాడారని, వారి ఆ మాటలను కోలివుడ్ ఖండించింది. ఇందుకు కూడా ప్రజలు, అభిమానులు ఈ సున్నితమైన అంశంపై రెచ్చిపోవడానికి దారితీసింది. ఇలా కోలీవుడ్, శాండిల్ వుడ్ కు చెందిన ప్రబుద్ధులే ఒక రకంగా ప్రజలు ఇంతలా రెచ్చిపోవడానికి దారితీశారని చెప్పవచ్చు. ఆ తర్వాతే రెండు రాష్ట్రాలు అట్టుడికాయి. బెంగళూరులో అంతటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇటు చెన్నైలో కూడా భారీ మొత్తంలో కర్నాటకకు చెందిన ఆస్తులకు నష్టం కలిగింది. బెంగుళూరులోనైతే పెద్ద సంఖ్యలో లారీలను, బస్సులను, ఇతర వాహనాలను కన్నడిగులు దగ్ధం చేసి తీవ్ర నష్టానికి గురి చేశారు. అయితే కన్నడ రాష్ట్రానికే  రూ.25వేల కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుందని తాజా సమాచారం. కాగా ఈ నేపథ్యంలో కర్నాటకలోని తమిళుల ఆస్తులపై జరిపిన దాడిని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి డిఎండికె పార్టీ అధినేత విజయకాంత్ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించాడు. కాగా తమిళులకు జరిగిన అన్యాయంపై విజయకాంత్ నిరాహార దీక్షకు దిగనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నిజమైతే సినిమా రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయనేది ప్రజలు, ప్రభుత్వాలకే తెలియాలి.

Advertisement
CJ Advs

ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. రజనీ కర్ణాటకకు చెందిన వాడే. అలాగే ప్రభుదేవా, రమేష్‌ అరవింద్‌, బాబీ సింహా వంటి కర్ణాటకకు చెందిన నటుల ఇంటి వద్ద కూడా ప్రభుత్వం భారీగా భద్రతను ఏర్పాటు చేసింది. సెలబ్రిటి అయిన వ్యక్తులు ప్రజల్లోకి వచ్చి ప్రజా సంబంధమైన విషయాలపై ఎలా స్పందించాలో కూడా తెలుసుకోలేని ఒక అస్పష్టవైఖరితో నటులు ఉన్నారంటే సిగ్గేస్తుంది. చివరికి ప్రజలను రెచ్చగొట్టిన నటులు ప్రజల నుండి రక్షణ కోసం భద్రతను ఏర్పాటు చేసుకోవాల్సి రావడం చాలా శోచనీయం.

ఏది ఏమైనప్పటికీ జరగాల్సిన నష్టం, ఘోరం జరిగాక... పరిస్థితి కాస్త చల్లారిపోయిన తర్వాత మళ్ళీ విషయానికి ఆజ్యం పోసేలా ఉంది కమల్ హాసన్ వ్యాఖ్యలు. ఈ కావేరి జలాల ఆరాట, పోరాటాలపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించాడు. కావేరి జలాలా వివాదం అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించిన అంశంగా అది ప్రవాహంలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుందంటూ కమల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ అంశం ప్రస్తావనా అవసరమా కమల్ జీ. ఇంకా ఆయన ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆదిమ మానవుల కాలంనుంచి ఈ కావేరీ జలాల వివాదం కొనసాగుతూనే ఉందని,  ఇది నిన్న పుట్టి, రేపటితో ముగిసేది కాదు అన్న రీతిలో విషయాన్ని పోస్ట్ చేశారంటే కమల్ చారిత్రక పరిజ్ఞానం గొప్పదే కానీ, చెప్పాల్సిన సందర్భం మంచిది కాదనేదే ఇక్కడ ప్రధానాంశం. కానీ చారిత్రకంగా ఆదిమ కాలంలో నీటి కోసం యుద్ధాలు జరిగినట్టు ఎక్కడా వినలేదు. అప్పట్లో పుష్కలంగా వర్షాలు ఉండేవి. కాగా కమల్ ఈ వివాదం ఇంతటితో సద్దుమణగాలని కోరుకోకుండా అంతర్రాష్ట్ర జలాల వివాదాల ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్వీట్ చేయడం సరికాదంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.

కానీ ఇటువంటి పరిస్థితుల్లో కావేరి జల ఉద్యమంపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి సదానంద గౌడ తమిళులే ముందు రెచ్చగొట్టారని అన్నాడు, కానీ సినిమా వాళ్ళు అనలేదు. అలా బ్రతికిపోయారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారని , కన్నడిగుల ఆస్తులపై తమిళనాడులో మొదట దాడులు జరిగాయని అన్నాడు. ఆ తర్వాత  ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరాడు. ప్రస్తుత సమయంలో కర్ణాటకకు అవసరమైన నీళ్లే లేవని, ఈ విషయాన్ని అంతా గమనించాలని ఆయన అన్నాడు. కావేరి పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొందని, అందువల్లే ఈ సమస్య వచ్చిందన్నాడు. నలభై శాతం తక్కువ వర్షపాతం ఉందని, రెండు మూడు రిజర్వాయర్ లలోనే తాగునీరు అందుబాటులో ఉందని ఆయన వివరించాడు. కాగా కేంద్రమంత్రి హోదాలో ఉన్న సదానంద తమ రాష్ట్రం వైపు నిలబడి మాట్లాడడం సరికాదని. అలా మాట్లాడటం ఎంతమాత్రం కరెక్ట్ కాదని వాస్తవ పరిస్థితులు ఆలోచించి మాట్లాడాలని తమిళులు సదానందపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ సినీనటుల నిరాహార దీక్షలు, సంఘీభావాలు ప్రజల్లో ఎటువంటి భావాలను, ప్రకంపనకు గురిచేస్తాయో వేచి చూడాలి.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs