ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆశావహుల హడావుడి మొదలైంది. ఈ దసరా పండుగ నాటికే మంత్రివర్గంలోకి కొత్త మంత్రులను తీసుకోనున్నారని ఊహాగానాలు రేగడంతో తెదేపా నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ సారి ఉత్తరాంధ్రకు పెద్ద పీఠ వేసి కనీసం ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తుండటంతో తెదేపా నాయకుల్లోని ఆయాజిల్లాలకు చెందిన ప్రతి నాయకుడూ ఆశాలోకంలో విహరిస్తున్నారు. కాగా చంద్రబాబు చాలా తెలివిగా తన రాజకీయ పరిజ్ఞానంతో ముందు ముందు మైలేజ్ తో అన్నింటినీ బేరీజు వేసుకొని తన లెక్క ప్రకారం ఎవరికి ఇవ్వాలనుకుంటున్న విషయంపై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా ఇప్పటికే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం అయిన ఆ జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులున్నారు. ఒకరు శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు కాగా, మరొకరు విజయనగరం నుండి మృణాళిని. వీరిద్దరిలో మృణాళిని పనితనంలోనే కాకుండా ప్రజాకర్షణ వంటి పార్టీకి మైలేజ్ తీసుకొని వచ్చే విషయాల్లో నిమ్మనంగా వ్యవహరిస్తుండటంతో ఆమెకు చెక్ పెట్టి అదే కుటుంబానికి చెందిన కిమిడి కళావెంకటరావుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇలా చేయడం ద్వారా అదే జిల్లాలో మరో మంత్రికి అవకాశం ఇవ్వడమే కాకుండా కాపు సామాజిక వర్గాన్ని కూడా సంతృప్తి పరచినట్లు ఉంటుందనే భావనలో బాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలే పలు రకాల ఉద్యమాలతో కాపులు రెచ్చిపోనుండటంతో వారిని శాంతపరిచే నిమిత్తం ప్రత్యేకంగా ఈసారి బాబు ఆ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు అర్ధమౌతుంది.
కాగా అదే విజయనగరం జిల్లాకు చెందిన వైకాపా నుండి తెదేపాలోకి వచ్చిన బొబ్బిలి రాజా రంగారావుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అదే జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వైకాపా నుండి చాలా మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి దూకిన వాళ్ళు కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశిస్తుండటంతో వారిని కూడా శాంతపరిచేందుకు బాబు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అదే విధంగా చినబాబు అయిన లోకేష్ ను కూడా మంత్రివర్గంలోకి తీసుకొనే భావనలో బాబు ఉన్నట్లు తెదేపా హడావుడి చేస్తుంది. అదే నిజమైతే ఆయన ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడన్న విషయం తెలియాల్సి ఉంది. ఇంకా కడప జిల్లాలో సతీశ్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమన్న వార్తలు ముమ్మరంగా వినపడుతున్నాయి. కాగా మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు వచ్చినప్పటి నుండి తెదేపాలో ఆశావహుల హడావుడి ఎవరి స్థాయిలో వారు చేస్తున్నట్లు సమాచారం.