కేరళ పౌరులంతా సంవత్సరానికి ఓసారి ఓనమ్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాంటి ఓనమ్ పండుగను పురస్కరించుకొని మలయాళీలకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా చేసిన ట్వీట్ పై వివాదం రేగుతుంది. అమిత్ షా ఏమన్నారంటే ఓనమ్ పండుగ సందర్భంగా ఓనమ్ శుభాకాంక్షలు అని చెప్పడానికి బదులు వామన జయంతి శుభాకాంక్షలు అని తెలపడంతో కేరళీయుల మనసును గాయపరిచినట్లయింది. కేరళీయులు ఎంతో ప్రగతిశీల భావాలతో ఉంటారు. అలాంటివారిపై పొరపాటుపడినా, అలాంటిది బాధ్యతాయుత పదవిలో కొనసాగే వారు పెడితే మలయాళీలు అస్సలు ఊరుకోరు. అందుకు వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా రెచ్చిపోయాడు. అమిత్ షా ఓనమ్ పండుగ ప్రత్యేకత తెలుసుకోకుండా వెటకారభావంతో మాట్లాడినందుకు మొత్తం కేరళ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు.
కేరళ ప్రజలు ఓనం పండుగను మహాబలి త్యాగానికి ప్రతీకగా ప్రతి ఏడాది జరుపుకుంటారు. మహాబలి అంటే మానవత్వానికి చిహ్నంగా, ఐకమత్యానికి అద్దంపట్టేలా అక్కడి ప్రజలంతా భావిస్తారు. కేరళలో ఓనమ్ రాష్ట్ర పండుగ కూడానూ. ఐతిహాసికంగా చూస్తే.... వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు. అప్పుడు బలి చక్రవర్తి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరాన్ని పొందుతాడు. దాంతో ప్రతి సంవత్సరం బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజలను సుఖ సంతోషాలతో చూస్తాడని అక్కడి భక్తుల నమ్మకం. అలా సంవత్సరానికి ఓ రోజు వచ్చే ఓనమ్ పండుగను కేరళ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా కేరళవాసులు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అక్కడ ఓనమ్ పండుగను జరుపుకుంటారు. కేరళ రాష్ట్రంలో ఉన్నమలయాళీలైతే ఓ పది రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. చివరి రోజు మాత్రం బలిచక్రవర్తి తమ ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఆ రోజు మొత్తాన్ని కేరళ ప్రజలు బలి చక్రవర్తికి అంకితం చేస్తారు.
కాగా అలాంటి పవిత్రమైన ఓనమ్ పండుగ రోజును వామనుడి అవతారంగా ఓనమ్ ను 'వామన జయంతి' గా మార్చేస్తూ ట్వీట్స్ పెట్టిన అమిత్ షా పట్ల కేరళ ఆగ్రహంతో ఉంది. ఇది ఇలా ఉండగా కేరళ సీఎం విజయన్, అమిత్ షా మలయాళీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన కాసేపటికే హ్యాపీ ఓనమ్ అంటూ అమిత్ షా మళ్ళీ మరో ట్వీట్ పెట్టాడు. ఇది నేపథ్యం తెలుసుకోని తప్పిదంగా పలువురు భావిస్తున్నారు.