కావేరి జలవివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రగులుతున్న కొలిమిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదనకు లోనయ్యాడు. రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరగడం చాలా బాధాకరమైన అంశంగా ఆయన వివరించాడు. ఈ సందర్బంగా నీటి నిర్వహణ- సంరక్షణ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మెలకువతో చేపట్టిన నీరు- ప్రగతి ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. అందులో భాగంగా నీటి వినియోగం, పరిరక్షణ- వంటి విషయాలపై అధికారులతో తీవ్రమైన చర్చ జరిపినట్లు తెలుస్తుంది. కాగా నీటిని సమన్వయం చేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయో తమిళనాడు-కర్ణాటక ప్రభుత్వాలే ప్రత్యక్ష ఉదాహరణలుగా అధికారులకు ఆయన సూచించాడు.
మొదట నుంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని అందులో భాగంగా ఇంకుడు గుంతలు లెక్కకు మిక్కిలిగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించడానికి నీరు-మీరు పథకం ద్వారా వాటర్ స్టోరేజ్ ని పెంచుతున్నామని, అలా భూగర్భ జలాలను ఎక్కువ మొత్తంలో నమోదు చేసేందుకు పాటు పడుతున్నట్లు ఆయన వివరించాడు. రాబోయే కాలంలో నీటి సంక్షోభాన్ని అధిగమించడం అంటే ప్రగతి సాధించడంలో ఓ భాగమని, అందుకోసం నదుల అనుసంధానం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని బాబు తెలిపాడు. ఇందులో భాగంగా మండలానికి పది చెరువుల చొప్పున అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని కూడా అధికారులకు దిశా నిర్దేశం చేశాడు. కాగా లక్షమంది విద్యార్ధులకు నీటి సంరక్షణ గురుంచి వివరించి వారి సేవలను సమాజానికి ఉపయోగించుకోవాలని, అలాగే పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని బాబు అధికారులకు సూచించాడు.