తెదేపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ పక్క ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చక్కబెడుతూనే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెదేపా పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తెదేపా కేడర్ ను డవలప్ చేసేందుకు ఈ మధ్య ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో సరికొత్త రీతిలో ముందుకెళ్ళాలని పార్టీ కార్యకర్తలకు, నేతలకు సంకేతాలిస్తున్నాడు. అందులో భాగంగానే హైదారాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో తెదేపా నేతలైన రేవంత్ రెడ్డి, ఎల్. రమణ, మోత్కుపల్లి నరసింహులు, గరికపాటి, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు తెరాసపై పోరాడేందుకు భవిష్యత్తు ప్రణాళికను తెలియజేసినట్లు తెలుస్తుంది. కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, తెరాస అధినేతగా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటిపై ఉధ్యమించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తుంది.
తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాడాలని పార్టీ నేతలందరికీ పిలుపునిచ్చాడు బాబు. అదే విధంగా కొత్తగా ఏర్పడబోయే 27 జిల్లాలలో కూడా బలమైన నాయకత్వాన్ని, కేడర్ ను డవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని బాబు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకనుగుణంగా భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచే విధంగా గ్రామస్థాయిలో నాయకులను, పటిష్ఠమైన క్యాడర్ ను నిర్మించుకోవాలని బాబు వెల్లడించాడు. ఇదే సమయంలో బాబు ఈ మధ్య జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కూడా సమీక్ష జరిపాడు. బాబు పెట్టిన ఈ సమావేశం ద్వారా కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని వైపుల నుండి వత్తిడి తెచ్చి ఆదిశగా పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనను నేతల ముందు పెట్టినట్లు తెలుస్తుంది.