ఇప్పుడిప్పుడు మన హీరోలు, దర్శకనిర్మాతలు తమ పంథాను మార్చుకొంటున్నారు. ద్విభాషా చిత్రాలపై కన్నేశారు. మలయాళంతో పాటు తమిళ మార్కెట్‌పై కూడా కన్నేస్తున్నారు. తాము నటించిన చిత్రాలను తమిళంలోకి, మలయాళంలోకి డబ్ చేసి అక్కడ కూడా తమ క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సెంటిమీటర్ సందిస్తే కిలీమీటర్ దారి దూసుకుపోయే తమిళ హీరోలు టాలీవుడ్‌పై ఎప్పటినుంచో కన్నేస్తున్నారు. కమల్, రజనీ నుండి కార్తిక్, ప్రభు, సత్యరాజ్, శరత్‌కుమార్, విశాల్, విక్రమ్, అర్జున్, కార్తి, సూర్య వంటి హీరోలు ఇలా చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా 'రఘువరన్ బి.టెక్' చిత్రం కాస్త బాగా ఆడే సరికి ఇక వరుసగా 'అనేకుడు, నారద, మరియన్... తాజాగా రైల్' చిత్రంతో మరలా తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ధనుష్. ఇప్పుడు మన హీరోలు కూడా తమిళ మార్కెట్‌పై కన్నేశారు. మహేష్‌బాబు తన 'శ్రీమంతుడు, బ్రహ్మ్మోత్సవం' చిత్రాలను తమిళంలో డబ్ చేశారు. కానీ ఈ చిత్రాలకి మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పలేదు. కానీ తాజాగా మురుగదాస్ చిత్రం కోసం తమిళం అనర్ఘళంగా మాట్లాడే మహేష్ ఈ చిత్రానికి తమిళంలో కూడా తానే డబ్బింగ్ చెబుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఊపిరి' చిత్రానికి సైతం నాగ్ తనే తమిళంలో సొంతగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం. మన హీరోలు మాత్రం కాస్త ఆలస్యమైనా సరే తామే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకొని తమ ప్రోఫెషన్‌కు గౌరవం తీసుకొస్తున్నారు.