తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ మాటల వార్ నడుస్తూ ఉంటుంది. అలాంటిది కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం విని కవిత సంతోషంతో పొంగిపోయింది. ఒకానొక టైమ్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా సరే దానికి వెంటనే కవిత నుండి కౌంటర్ పడేది. ఒకానొక దశలో పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటే పవన్ కూడా అందుకు ధీటుగా కవితక్కా.. తానెందుకు సమాధానం చెప్పాలంటూ అదే స్టైల్లో రెచ్చిపోయి మరీ కామెంట్లు, సెటైర్లు వేసేవాడు.
కాగా కాకనాడ సభలో పవన్ తెలంగాణ పట్ల చాలా అనుకూల వైఖరితో మాట్లాడాడు. తెలంగాణకు కేంద్రం ఇంకా హైకోర్టును తేల్చలేదన్నాడు. ఉత్తరాదివారికి దక్షిణ భారతీయులంటే వివక్ష ఉందని, అసలు కాంగ్రెస్, భాజపాలకు తెలుగు వారంటే చులకన భావమని పవన్ వెల్లడించాడు. అంతే కాకుండా పవన్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్ళిన తాను అక్కడ విద్యార్ఖులకు తెలంగాణ బ్రతుకు పాట వినిపించానని అది కాకినాడ సభాముఖంగా పాడి వినిపించాడు. దీంతో కవిత ఆశ్చర్యానికి లోనై పవన్ ప్రసంగాన్ని స్వాగతిస్తున్నానని వెల్లడించింది. పవన్ ప్రసంగం అయిన అర్ధగంటలోనే ఆగలేక పోయిన కవిత ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ ను అభినందించింది. ఈ సందర్బంగా తెలంగాణ హైకోర్టు విషయం కేంద్రం త్వరగా తేల్చాలని తెలిపింది.