నిన్న(శుక్రవారం) పవన్ కాకినాడ సభలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ని, బిజెపిని తెగ విమర్శించేశాడు. కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే బిజెపి పొట్టలో పొడిచిందని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. ప్రత్యేక హోదా సాధించడానికి నేతలు రాజీనామా చేయాలని... నేతల వల్ల కాకపొతే జనసేన పార్టీ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. అయితే పవన్ ఒకే ఒక వ్యక్తి ని బాగా టార్గెట్ చేసాడని అంటున్నారు. ఇదివరకు ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించిన వెంకయ్యనాయుడిని పవన్ టార్గెట్ చేసాడని అంటున్నారు. వెంకయ్య నాయుడు ఏపీ కోసం ఏదో చేస్తాడని అనుకుంటే ఏమి చెయ్యలేక చేతులెత్తాశాడని... ఏపీలో బిజెపిని పూర్తిగా చంపేశాడని ఘాటైన విమర్శలు చేసాడు పవన్. అయితే ఈ విమర్శలకు స్పందించిన వెంకయ్య నాయుడు. ఏపీ విషయంలో తన చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని, ప్రత్యేక హోదాపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని... అయితే ప్రజా సమస్యలపై మాట్లాడండి కానీ ఎవరిమీద వ్యక్తిగత విమర్శలు చేయవద్దని... అలాంటి వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించారు. ఏపీకి హోదాకు మించిన సాయం కేంద్రం చేస్తుందని ఇంకా మీకేం కావాలని ప్రశ్నించారు. అయినా హోదా విషయం లో ఎవరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అసలు నేను కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఏపీకి చేయాల్సిన సాయం చేస్తూనే ఉన్నానని, రాజకీయ జ్ఞానం ఉన్న వారికి తెలుగువారి కోసం నేను చేస్తున్న కృషి అర్థం అవుతుందని అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొట్ట మొదట పట్టుబట్టింది నేనొక్కడినే అని వెంకయ్య అన్నారు. ఇక ఇప్పుడు హోదాపై మాట్లాడుతున్నవారు అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. మరి ఈ వెంకయ్య గారి స్పందనకు పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో... లేక మనకెందుకులే అని కామ్ గా ఉంటాడో చూద్దాం.