పవన్ సీమాంధ్రుల ఆత్మగౌరవం సభలో మాట్లాడుతూ.. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా విమర్శనాస్త్రాలు వదిలాడు. ఒకేసారి రెండిటిని కడిగిపారేయాలని కంకణం కట్టుకుని మరీ ప్రిపేర్ అయి వచ్చినట్లు పవన్ ప్రసంగం సాగింది. కేవలం అవకాశవాదపు రాజకీయాల వల్ల గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువచ్చారని పవన్ ఆరోపించారు. ఒక్కరు కాదు చాలామంది కలిపి నాలుగు దశాబ్దాలుగా మోసం చేస్తూనే ఉన్నారని, అందుకే కాకినాడకు వచ్చానని పవన్ స్పష్టం చేసాడు. పవన్ తన ప్రసంగం లో ఒక మాట చెప్పాడు. అదేమిటంటే నేను రాష్ట్రాన్నివిడగొట్టిన తీరు చూసి 11 రోజులు అన్నం ముట్టలేదని పవన్ కల్యాణ్ సభాపక్షం గా తెలియజేశాడు. అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరోలా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రవర్తించాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. దేశంలోని రాష్ట్రాల విభజనపై సమగ్రంగా మాట్లాడిన పవన్...... రాష్ట్రాల అవతరణపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓ సమగ్ర విధానాన్ని రూపొందించారని అన్నారు. ప్రస్తుతం ఆ స్ఫూర్తి పోయిందన్నారు. అయితే ఆ తర్వాత కారణాలు ఏవైనా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోందన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రుల వెన్నులో పొడిస్తే ఆదుకుంటుందనుకున్న బీజేపీ పొట్టలో పొడిచిందని ఆవేదన వ్యక్తం చేసాడు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వారు ఒప్పుకోవడం లేదని, వీరు ఒప్పుకోవడం లేదని చెప్పడం సరికాదని కేంద్రాన్ని ఘాటుగా విమర్శించాడు. తాను ఇక్కడకు వచ్చింది భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కాదని, సమస్యలపై చెప్పుకునేందుకే వచ్చానని పేర్కొన్నారు. బంద్‌లకు పిలుపులివ్వడానికో, రాస్తారోకోలు చెయ్యమని చెప్పడానికో ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఏపీ లో ప్రత్యేక హోదా విషయం లో పార్టీలన్నీ విఫలమైన తర్వాత మనం రోడ్డుపైకి వద్దామని అన్నారు. ఉత్తరాది అహంకారం పైనే తన పోరాటం అని స్పష్టం చేసాడు పవన్. ఎంపీ లు సొంత లాభాన్ని కొంత మానుకోవాలని హితవు పలికాడు. ఇక ఏపీలో బిజెపిని వెంకయ్యనాయుడు పూర్తిగా చంపేశాడని... బిజెపి ఎమ్యెల్యేలు, ఎంపీలు వేరే ఏదొక పార్టీ చూసి మారడం మంచిదని వారిని హెచ్చరించాడు. ఇక హోదా విషయం లో అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి మార్గదర్శకం గా నిలవాలని శ్రీనివాసుకి డైరెక్ట్ గా చెప్పిన పవన్.... ఆయనని మళ్ళీ గెలిపించడానికి నేను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ ఇంత స్పష్టం గా మాట్లాడిన తర్వాత ఏపీ బిజెపి నేతలు, టిడిపి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం?