ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు సరికొత్త ప్యాకేజీ తో కేంద్రం చేతులు దులిపేసుకున్నవిషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో అధికారంలో ఉన్న తెదేపా బాగా ఇరుకున పడిపోయింది. తెదేపా అధినేత, ఏపీ సీయం నారా చంద్రబాబు నాయుడు భాజపాతో లాలూచీ పడినట్లుగానే రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబును ఈ విషయం మరింత చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఓటుకు నోటులో బాబు దొరికిపోయిన కారణంగా కేంద్రంపై సరిగ్గా పోరాటం చేయడం లేదు సరికదా అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని మరీ నన్ను అందులో ఇరికించకుండా బయటపడవేయండంటూ ప్రాదేయపడుతున్నాడని... అందులో భాగంగానే రాష్ట్రాన్ని గాలికి వదిలేశాడని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వంలోంచి తెదేపా బయటకి రావాలని కూడా ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సవాలుగా తెదేపా నాయకులు కేంద్రంతో తాము తెగతెంపులు చేసుకోవడం చాలా చిన్న విషయమని, అందుకు క్షణం పట్టదని ధీటుగా సమాధానం చెప్తున్నారు.
కాగా ఇప్పటివరకు ఊరించి ఊరించి ఉసూరుమనిపించి చివరకు ప్యాకేజీ ప్యాక్ చేస్తున్నామంటున్న కేంద్రంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ఇంకా రాష్ట్ర ప్రజలను ప్రత్యక్ష మోసానికి గురి చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోణంలో చూస్తే పవన్ రాష్ట్ర నాయకులు వారి పోరాటాల గురించి గాని ప్రస్తావిస్తే అందుకు ధీటుగా ఎదుర్కొనేందుకు తెదేపా రంగం సిద్ధం చేసుకుంటుంది. మొన్న తిరుపతిలో జరిగిన సభలో పవన్ మాటలకు అధికార పక్షం నుండే తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగించేందుకు ఇంకాస్త ఎక్కువగా దాడిని, టోన్ ను పెంచి మాట్లాడేందుకు ఆయా జిల్లా నాయకులపై, ఫైర్ బ్రాండ్ లకు బాబే స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తెదేపా నాయకత్వంపైనా, అధి నాయకుడిపైనా, పార్టీపైన ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేసినా అందుకు ధీటుగా ప్రతిస్పందించేందుకు తెదేపా సన్నాహాలు చేస్తుంది. ఇంకా ప్రత్యేక హోదా తేలేని ఇటువంటి పరిస్థితుల్లో తెదేపా ప్రజల పట్ల అనుకూలవైఖరిని, జనసేన అధినాయకుడి పట్ల వ్యతిరేకతను ప్రదర్శించేందుకు కసరత్తులు, తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.