ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రుల సాక్షిగా కేంద్రం వైఖరి మరోమారు స్పష్టపడింది. ఆంధ్రులంతా కలిసి ప్రత్యేక హోదాపై ఆశలు పెట్టుకుంటే ప్రత్యేక ప్యాకేజేనంటూ నిర్ణయం తీసేసుకుంది కేంద్రం. ఆ దిశగా ప్రకటన కూడా చేసేసింది. ప్రత్యేక హోదాపై మరోమారు కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా రాష్ట్రానికి కొలిమి రాజేసినట్టయింది. ఆంధ్రాలోని ప్రతివ్యక్తి ప్రత్యేక హోదా అంశంపై గంభీరంగానూ, రగిలిపోతూనూ ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సెగ ఇప్పుడు ఏపీని ఊపేస్తుంది. సీమాంధ్రుల రక్తం సలసలా కాగేలా చేస్తుందనే చెప్పాలి. చాలాకాలం నుండి హోదాపై నాటకాలాడుతున్న కేంద్రం ఎత్తుగడకు నిన్నటితో తెరపడింది. ఆంధ్రా ప్రజలు ప్రత్యేక హోదా కోరడంలో తప్పులేదంటూనే... జైట్లీ హోదా ఇవ్వడం కష్టం అంటూ చేతులెయ్యేడం తెలిసిందే. అంటే కోరడంలో తప్పులేదన్నప్పుడు ప్రజలు ఎలాంటి ఉద్యమాలు చేస్తే హోదా దక్కించుకోవచ్చు అన్నది చర్చనీయాంశంగా మారింది.
సరిగ్గా ఇదే సదర్భంలో ప్రత్యేక హోదా విషయంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉద్యమిస్తాననడంతో ప్రత్యేక సెగ మళ్ళీ రాజుకుంటుంది. అది ఎలా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నది చెప్పడం కష్టంతో కూడుకున్న విషయమే. అంటే ఎలాంటి పరిస్థితులకైనా హోదాపై ఉద్యమం దారితీసే అవకాశం ఉంది. అందుకోసమనే సరైన సమయంలో సరైన రీతిలో మేల్కొన్న పవన్ కళ్యాణ్ ‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ అన్న పేరుతో ఈరోజు జరిగే ఉద్యమానికి భారీ స్పందన వస్తుంది. ఇప్పుడు ప్రత్యేక ఉద్యమం కోసం పోరాడేందుకు ఆంధ్రులకు ఒకే ఒక దిక్కుగా పవన్ కళ్యాణ్ దర్శనమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి పవన్ పై పడింది. కాకినాడ సభకు దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇక్కడ పవన్ ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హోదా సంగతి ముగిసిందప్పా అంటూ స్పష్టం చేసిన జైట్లీ, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ముష్టి పడేసిన ఈ నేపథ్యంలో పవన్ ఏ దిశగా అడుగులు వేస్తారన్నది కొద్ది గంటల్లోనే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా... జైట్లీ ప్రకటనకు చంద్రబాబు గుడ్డిగా.. అలా అయితే స్వాగతం అంటూ అనుకూలవైఖరి ప్రదర్శించడం పట్ల కూడా ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆ నాయకుల తీరును ఎలా ఎండకడతాడన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.
కాగా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పవన్ మోడీ అండ్ కో పై ఎటువంటి పంచ్ లు పేలుస్తాడో, ఆ దాటికి కేంద్రంలో కదలికలు వస్తాయా…? లేక ఇదంతా కాదని నిరాహార దీక్షకు కూర్చుంటాడా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ నిరాహార దీక్షకే గాని పవన్ సిద్ధమైతే పరిస్థితులు తీవ్రతరంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని ఇటువంటి సంక్లిష్టమైన స్థితిలోనే పడవేసి ప్రత్యేక హోదాని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. .