అక్కినేని ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. త్వరలో నాగార్జున కుటుంబంలో పెళ్ళి సందడి మొదలు కాబోతుంది. కొంతకాలం నుండి మీడియాలో విస్తృతంగా అఖిల్, నాగ చైతన్యల వివాహానికి సంబంధించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్వయంగా నాగార్జునే క్లారిటీ ఇచ్చాడు. ఈ సంవత్సరమే, డిసెంబర్ 9వ తేదీన అఖిల్ నిశ్చితార్ధం జరుగుతుందని తెలిపాడు. ఇంకా నాగార్జున మాట్లాడుతూ అఖిల్, నాగ చైతన్యల వివాహానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు వెంటనే వారి వివాహం చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని నాగార్జున వెల్లడించాడు. ఇదే సందర్భంగా నాగార్జున, నాగ చైతన్య వివాహం కూడా వచ్చే సంవత్సరం జరుగుతుందని తెలిపాడు.
అయితే అఖిల్ కోరిక మేరకే తాము డిసెంబర్ లో నిశ్చితార్థం పెట్టుకున్నట్లు నాగార్జున తెలిపాడు. కాగా విలేకరులు నాగ చైతన్య జీవిత భాగస్వామి గురించి అడిగిన ప్రశ్నకు 'రోజూ మీరు రాస్తూనే ఉన్నారుగా, నా చేత చెప్పించడం ఎందుకు' అన్నాడు. దీంతో నాగ చైతన్య సమంతాను, అఖిల్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయిన శ్రేయ భూపాల్ ను వివాహం చేసుకోనున్నట్లు వెల్లడైంది.